- నారాయణపేట ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్
మహబూబ్‌నగర్, వెలుగు : పిల్లలు చిన్నతనం నుంచే ప్రయోగాలు చేయడం నేర్చుకోవాలని నారాయణపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆ ప్రయోగాలు ఫెయిల్అయినా మళ్లీ ప్రయత్నం చేయాలని స్టూడెంట్లకు సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట మండలం జాజాపూర్ జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ తనకు సైన్స్ అంటే చాలా ఇష్టమని, తనకూ ప్రయోగాలు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు అని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం స్టూడెంట్లు తయారు చేసిన సౌర సైకిల్, బుజ్ వైర్, అంబులెన్స్ లైన్ క్లియర్, ఆటోమెటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టం, ఫ్లడ్ ప్రొటెక్ట్ హోమ్, స్మార్ట్ షూ, సీలింగ్ డస్ట్ క్యాచర్ విత్ అంబ్రెల్లా, ఆటోమెటిక్ ఫాగ్ మేకర్ మిషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, రి ఫారెస్టేషన్ విత్ డ్రోన్, పచ్చిరొట్టెల ఎరువులు, కలుపు మొక్కల తీసివేత ప్రయోగాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీను, డీఈవో గోవిందరాజులు, డీఆర్డీవో మొగులప్ప, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
