- కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో చక్రం, విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వల్ల ఆవిర్భవించాయన్నారు. ఒక అంశంపై పరిశీలన ద్వారా అవగాహన కలుగుతుందని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రెండు రోజుల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 284 ప్రదర్శనలు ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయిలో కనీసం 10 నుంచి 15 వరకు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. తరగతి గదిలో విన్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఒక మంచి అవకాశం అన్నారు జిల్లా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వాణి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, సైన్స్ అధికారి లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.
