14 లక్షల మంది రైతులకు..రుణమాఫీ ఎగవేత

14 లక్షల మంది రైతులకు..రుణమాఫీ ఎగవేత
  • ఆ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించినట్టు ఆరోపణలు
  • ఇప్పుడు అన్నదాతలకు నోటీసులు పంపుతున్న బ్యాంకులు
  • ఎన్నికల టైమ్​లో కొందరికే మాఫీ చేసిన గత ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు :  రైతుల పంట రుణాలపై గత సర్కార్​ నిర్వాకంతో గందరగోళం నెలకొన్నది. ఎన్నికల ఏడాది చివరలో కొంతమందికే రుణ మాఫీ చేసి.. మిగిలిన నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించింది. దీంతో పంట రుణాలు మాఫీ కాకుండా మిగిలిపోయిన రైతులకు బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. ఇలా దాదాపు 14 లక్షల మంది రైతులకు గత సర్కార్​ ఢోకా ఇచ్చినట్లు తేలింది. అత్యధికంగా పంట రుణాలు లక్ష రూపాయలు, ఆపైన ఉండగా.. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అలాంటి వారినే విస్మరించింది. దాదాపు నాలుగున్నరేండ్లు మాఫీని నాన్చి.. ఎన్నికలకు రెండు నెలల ముందు అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నది. రైతులకు చేరాల్సిన దాదాపు రూ. 8 వేల కోట్ల రుణమాఫీ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించినట్లు తెలుస్తున్నది. దీంతో ఆ రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం మాదిరి  కాకుండా.. ఒకటి లేదా రెండు దఫాల్లోనే మాఫీ పూర్తి చేయాలని చూస్తున్నది. ఇందుకోసం ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నది. ఇలా ఒకటి లేదా రెండు దఫాల్లోనే మాఫీ చేస్తే రైతులపై వడ్డీ భారం పడకుండా ఉంటుందని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. లోక్​సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర సర్కార్​ ఆ దిశగా కసరత్తు చేయనున్నది. 

అప్పుడు నాన్చి.. ఇప్పుడు లొల్లి

రుణమాఫీని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్​ఎస్​.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గగ్గోలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. ఆ తర్వాత రకరకాల కొర్రీలు పెట్టింది.  రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 2,5916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించింది.  దీంతో  36.68 లక్షల మంది రైతులకు రూ.20,141 కోట్లు మాఫీ చేయాలని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. వాటికి కూడా ఐదేండ్ల పాటు బడ్జెట్లలో నిధులను కేటాయించడమే తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తొలి ఏడాది రూ.25 వేల వరకు మాఫీ చేసి చేతులు దులుపుకున్నది. ఆ తర్వాత 2023లో ఎన్నికల ముందు రూ.99,999 వరకు రుణాలు ఉన్నవాళ్లకు నిధులు విడుదల చేసింది. రూ. లక్ష, ఆపైన రుణాలు ఉన్న దాదాపు 14 లక్షల మందికి మాత్రం మాఫీ చేయలేదు. ఇది దాదాపు రూ.8 వేల కోట్లు. వీటిని కాంట్రాక్టర్లకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈసారి ఒక దఫా లేదంటే.. రెండు దఫాల్లో

 రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని ఏకకాలంలో చేయడం లేదా రెండు దఫాల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నది. గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి వివరాలు తెప్పించుకున్నట్టు తెలిసింది.