
- 12 ఏండ్ల తర్వాత గ్రూప్–1 మేమే పెట్టాం
- ఇచ్చిన ప్రతి మాటకూ కట్టబడి ఉన్నం
- హరీశ్.. బాబును ఉదాహరణగా తీసుకుంటున్రు
- మేం తెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తం
హైదరాబాద్: త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుల చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలివెళ్లిన ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామని చెప్పారు. హరీశ్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకొని మాట్లాడారంటే ఆయన పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణలో ఇక్కడి ప్రజల ఆలోచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ఏపీ ఆలోచనలు కాదని అన్నారు.
12 ఏండ్ల తర్వాత తామే గ్రూప్–1 పరీక్షను నిర్వహించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్ రావుకు లేదని, వాళ్ల హయాంలో ఆశ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతోందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. మతఘర్షణ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. వాటి వెనుక ఎవరున్నా ఉక్కుపాదంతో అణిచి వేస్తామని చెప్పారు.