బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులుండవ్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులుండవ్
  • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులుండవ్
  • ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చు:  మంత్రి మల్లారెడ్డి 
  • స్వచ్ఛందంగా ట్యాక్స్ కట్టేలా రూల్స్ తెస్తం 
  • దాడులకు భయపడ.. తన వెనుక కేసీఆర్ ఉన్నరని వెల్లడి 

గజ్వేల్, వెలుగు:  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో ఐటీ దాడులు ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చునని చెప్పారు. సంపాదించుకునేటోళ్లు స్వచ్ఛందంగా ట్యాక్స్ కట్టే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ బహిలంపూర్ లో మాజీ సర్పంచ్ నేర్లపల్లి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘బీజేపోళ్లు నన్ను దబాయించాలని ఐదారు వందల మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని పెట్టి 56 ఐటీ బృందాలతో రెయిడ్స్ చేసిన్రు. కానీ నా వెనుక సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు నేనెవరికీ భయపడ. 2024లో మా కేసీఆర్ ​ఆధ్వర్యంలో తప్పకుండా ప్రభుత్వం వస్తది. అప్పుడు దేశమంతటా ఇన్ కమ్ ట్యాక్స్ రిలాక్షేషన్ ఇస్తం. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇట్ల రెయిడ్లు గియిడ్లు ఏమీ చెయ్యం. వాళ్ల ఇష్టం తోటి వలంటరీగా ట్యాక్సులు కట్టుకునేలా కేసీఆర్ రూల్స్ తెస్తడు” అని అన్నారు. ప్రపంచంలో ఏడికెళ్లినా తన కాలేజీల్లో చదువుకున్నోళ్లు కన్పిస్తరని.. వరల్డ్ క్లాస్ ఇంజినీర్లు, డాక్టర్లను తాను తయారు చేశానన్నారు. ‘‘ఐటీవోళ్లు.. నీతాన అంతా దొంగ పైస ఉన్నది.. బ్లాక్​మనీ ఉన్నది.. నువ్వన్నీ డొనేషన్లు తీసుకుంటున్నవు అని అంటున్నరు. సంవత్సరానికి 50 వేల మంది విద్యార్థులు హాస్టల్, కాలేజీ, ట్రాన్స్ పోర్టు.. ఇలా ఎన్నో ఫీజులు కడుతరు. ఇవన్నీ దొంగ పైసలా? రైతులు కట్టేవి దొంగ పైసలా?” అని ప్రశ్నించారు. 

ఢిల్లీ కోట మీద కేసీఆర్ జెండా ఎగరేస్తరు.. 

రైతులు 13 నెలలు ధర్నా చేస్తే, వాళ్ల మీదకు కార్లు ఎక్కించి చంపిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని మల్లారెడ్డి విమర్శించారు. ‘‘మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక లాంటి మన చుట్టుముట్టూ ఉన్న రాష్ట్రాల ప్రజలు తెలంగాణల కలిస్తే బాగుండని అనుకుంటున్నరు. మాకాడ కూడా సాగు నీరొస్తుండే.. కరెంటు వస్తుండే.. దళిత బంధు వస్తుండే.. అని ఆలోచన చేస్తున్నరు. కర్నాటక, మహారాష్ట్ర రైతులు మనకాడ బోర్లు వేసుకొని సాగు నీరు తీస్కపోతున్నరు. ఎందుకంటే మనకాడ 24 గంటల కరెంటు ఉంటదని ఇట్ల చేస్తున్నరు” అని అన్నారు. ‘‘కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నడు.. రైతు బీమా ఇస్తున్నడు.. కాబట్టి దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నరు. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిండు. కేసీఆర్ దేశమంతా తిరుగుతడు.. 2024లో ఢిల్లీ లాల్ కోట మీద జెండా ఎగరేస్తడు” అని అన్నారు. ‘‘దేశంలో కరెంటు ఉన్నది.. సాగు, తాగు నీరు ఉన్నది.. కానీ వీటన్నింటినీ దేశమంతటికీ ఇచ్చే తెలివి బీజేపీ ప్రభుత్వానికి లేదు” అని విమర్శించారు.