రెంట్, మెయింటెనెన్స్ భరించలేక రూట్ మార్చిన స్టార్టప్​లు

 రెంట్, మెయింటెనెన్స్ భరించలేక రూట్ మార్చిన స్టార్టప్​లు

హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీస్​ను ఆఫీసులకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తుండగా, స్టార్టప్‌‌ కంపెనీలు ఆఫీస్​ల బిల్డింగ్​రెంట్, మెయింటెనెన్స్ భరించలేక ఖాళీ చేస్తున్నాయి. రెండు, మూడు కంపెనీలతో కలిసి నాలుగైదు సీటర్ల స్పేస్​ను రెంటుకు తీసుకుంటున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఆఫీసులను మొత్తానికే ఎత్తేసి పూర్తిగా వర్క్​ఫ్రమ్​హోంనే కొనసాగిస్తున్నాయి. ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచి వర్చువల్​గా మీటింగ్‌‌లు నిర్వహిస్తున్నాయి. అటు ఎంప్లాయ్స్ కు నచ్చినట్టుగా చేస్తూనే కంపెనీలు తమకు ఖర్చు తగ్గించుకుంటున్నాయి.

సొంత బిల్డింగులు లేక..

ఐటీ సెక్టార్​లో చిన్నా, పెద్ద, ఎంఎన్‌‌సీ కంపెనీలన్నీ కలిపి 2 నుంచి మూడువేల వరకు ఉన్నాయి. ఇందులో 30 శాతానికి పైగా స్టార్టప్‌‌లు ఉన్నాయి. కొన్ని బడా కంపెనీలకు సొంత బిల్డింగ్‌‌లు ఉండగా మిగిలినవన్నీ రెండు, మూడు ఫ్లోర్లను అద్దెకు తీసుకుని ఆఫీసులు నడిపిస్తున్నాయి. మూడేండ్లుగా ఐటీ ఎంప్లాయ్స్​కు వర్క్ ఫ్రమ్ హోం నడుస్తోంది.  ఎంప్లాయీస్​ను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నా మెజార్టీ మంది ఆసక్తి చూపించట్లేదు.  దీంతో లక్షల అద్దెలు కడుతూ ఆఫీసులను ఖాళీగా ఉంచే కంటే ఖాళీ చేయమే మంచిదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందరూ వచ్చేంత వరకు డిజిటల్‌‌ మోడ్​ను కొనసాగించాలని చూస్తున్నాయి. అప్పటివరకు టెంపరరీగా కో–వర్కింగ్ స్పేస్ ​తీసుకుంటున్నాయి. వందల మందికి కాకుండా నాలుగైదు సీటర్లతో నామ్‌‌కే వాస్తేగా ఆఫీస్ స్పేస్  కొనసాగిస్తున్నాయి. కేవలం లక్షన్నర, రెండు లక్షల ఖర్చుతోనే ఆఫీసులు రన్ చేస్తున్నాయి. ఉద్యోగులతో మీటింగ్‌‌లు ఏమైనా ఉంటే రిసార్ట్‌‌లు, రెస్టారెంట్లలో పెట్టుకుంటున్నాయి. 

ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం

పవర్, వాటర్, కెఫే, లాజిసిక్ట్స్, ఇంటర్నెట్ తదితరాల కోసం ఐటీ కంపెనీలు నెలకు ఒక్కో ఎంప్లాయ్ మీద 10వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. మూడేండ్లుగా వర్క్ ఫ్రమ్ హోం నడుస్తుండడంతో ఈ ఖర్చంతా తగ్గుతోంది. ఏడాదిగా ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కంపెనీలు చెబుతున్నా ఎవరూ రావడం లేదు. ముఖ్యమైన రోల్స్​లో ఉన్న ఉద్యోగులు, అవసరమైన వారితోనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నడుస్తోంది. ఉద్యోగులపై ఒత్తిడి చేస్తే జాబ్​ మానేస్తామని తేల్చి చెబుతుండడంతో కంపెనీలు వారి ఇష్టానుసారం వదిలేశాయి. ఈ క్రమంలో ఆఫీసులకు రెంట్, మెయింటెన్స్​పెరిగిపోవడంతో చాలా కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్‌‌లు ఖాళీ చేస్తున్నాయి.

అందరూ వస్తేనే ఆఫీస్ ఉంటది

నేను రెండేళ్ల నుంచి ఓ ఐటీ కంపెనీలో చేస్తున్నాను. మా కంపెనీకి మాదాపూర్​లో ఆఫీస్ ఉందని మొదట్లో చెప్పారు. జాయిన్ అయినప్పటి నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. కొన్నాళ్ల కింద ఆఫీస్​ తీసేశారని తెలిసింది. మరో కంపెనీతో టై అప్ అయి అక్కడికి మార్చారని చెప్పారు. ఇటీవల కొలీగ్స్​అందరూ ఓ రెస్టారెంట్‌‌లోనే కలిశారు. ఆఫీస్ గురించి ఏం మాట్లాడలేదు. అందరూ వచ్చేందుకు ఓకే అంటేనే ఆఫీస్ ​ఉండేలా ఉంది.
- శ్రీజ, ఎంప్లాయ్

కో–వర్కింగ్ స్పేస్​కి  షిఫ్ట్ అయ్యాం

ఇది వరకు రెండు ఫ్లోర్లలో ఆఫీస్ నడిపించాం. కరోనా ఎంటరైనప్పటి నుంచి మా ఎంప్లాయీస్​ అంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమే బాగుందని ఉందని చెబుతున్నారు. దీంతో ఆఫీసు రెంట్, మెయింటెనెన్స్ భరించలేక తీసేశాం. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కో–వర్కింగ్ స్పేస్‌‌లో ఐదు సీటర్ల స్పేస్ ని తీసుకున్నాను. కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి చేస్తున్నాం.
- రాజేశ్, ఫౌండర్, ఐటీ స్టార్టప్ కంపెనీ

ఖర్చు భరించలేక ఖాళీ చేస్తున్నరు

ఆఫీస్‌‌ స్పేస్‌‌కు గతంలో మూడు లక్షలపైనే రెంట్ ఉండేది. ఉద్యోగులు లేక ఖాళీగా ఉంటున్న బిల్డింగులకు రెంట్ ​కట్టడం ఇష్టం లేక యాజమాన్యాలు ఆఫీసులను తీసేస్తున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్​ల రెంట్లు తగ్గుతున్నాయి. అయితే మెయింటెనెన్స్​భరించలేని స్టార్టప్‌‌ కంపెనీలు ప్రస్తుతానికి కో వర్కింగ్​ స్పేస్​ తీసుకుని నడిపిస్తున్నాయి. ఎంప్లాయీస్​​ మొత్తం తిరిగి వచ్చాక అప్పుడు ఆఫీసులకు షిఫ్ట్ చేద్దామని భావిస్తున్నాయి.
- శ్రీధర్ మెరుగు, ఫౌండర్, ఐటీ అండ్ ఎంటర్​ప్రెన్యూరర్ ఫోరం