కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు ఇయ్యాల శంకుస్థాపన

కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు ఇయ్యాల శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌‌ హైదరాబాద్‌లో తమ కొత్త క్యాంపస్ కు బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్‌‌రెడ్డి, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 5న సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌‌బాబు కాగ్నిజెంట్ కంపెనీ సీఈవోతో చర్చలు జరిపి, విస్తరణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఇందులో భాగంగా పది రోజుల్లోనే హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు కంపెనీ శ్రీకారం చుట్టింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ క్యాంపస్ ద్వారా అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, మెషిన్‌‌ లెర్నింగ్‌‌, డిజిటల్‌‌ ఇంజనీరింగ్‌‌, క్లౌడ్‌‌ సొల్యూషన్స్‌‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ క్యాంపస్ ఫోకస్​ చేస్తుందని వివరించింది.  

కాగా, చెన్నై కేంద్రంగా 1994లో ఆవిర్భవించిన కాగ్నిజెంట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2002 నుంచి హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీకి ఐటీ కారిడార్‌‌లో ఐదు క్యాంపస్​లు ఉండగా.. అందులో దాదాపు 57 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌‌కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది.  

17న ఢిల్లీకి సీఎం!

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి 19 వరకు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నట్టు తెలిసింది. 11 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన.. మూడ్రోజుల పాటు వివిధ ప్రోగ్రామ్స్ లో పాల్గొని, 17న ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై చర్చించనున్నారు.

 శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇదివరకే ఢిల్లీ పెద్దలు నిర్ణయించడంతో.. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ లో వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతున్నది. మొదట పీసీసీ చీఫ్ నియామకం, ఆ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల 35 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా, మరో 25 వరకు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఆర్టీసీ, సివిల్ సప్లయ్స్, హుడా, మూసీ రివర్ ఫ్రంట్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. 

సీఎం ఢిల్లీ టూర్ లో వీటిపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల చేరికలను మళ్లీ స్పీడప్ చేయాలని రేవంత్ భావిస్తున్నారని తెలిసింది. సిటీలోని కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేల చేరికలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.