హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్ పై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్ పై ఐటీ దాడులు

హైదరాబాద్ : హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిగ్ సీ, లాట్ మొబైల్ షోరూమ్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టిన పెట్టుబడులు, వార్షిక ఆదాయ లెక్కలపై ఆరా తీస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను నష్టాల్లో చూపించి.. నిధులను వేరే సంస్థల్లోకి మళ్లించినట్లు పలు మాల్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలపైనా ఐటీ అధికారుల దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సంస్థ ద్వారా హానర్ రియల్ ఎస్టేట్ లో ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల ఫినిక్స్, వాసవి కన్ స్ట్రక్షన్స్ తో పాటు వాటి అనుబంధం సంస్థల్లోనూ సోదాలు చేయగా.. హానర్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు బయటపడ్డాయి. హానర్ కంపెనీతో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిగ్ సీ, లాట్ మొబైల్స్ మధ్య లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

హానర్ రియల్ ఎస్టేట్, ఫినిక్స్ సంస్థల మధ్య.. గల్ఫ్ ఆయిల్ కంపెనీకి చెందిన ఓ స్థలం క్రయవిక్రయం జరిగినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో హానర్ సంస్థ జోక్యం చేసుకున్నట్లు ఐటీశాఖ అధికారులు గుర్తించారు. హానర్ సంస్థ పెద్దఎత్తున పెట్టుబడులు, వ్యాపార సమూహాలను ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. హానర్ అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ బ్రదర్స్, లాట్ మొబైల్స్, బిగ్ సీల మధ్య చెల్లింపు వివరాలను ఐటీ అధికారులు సేకరించినట్లు సమాచారం. మరోవైపు కొంతమంది రాజకీయ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఓ నిర్మాణ సంస్థకు, హానర్ రియల్ ఎస్టేట్ సంస్థ అనుబంధంగా ఉన్నట్లు చెబుతున్నారు.