ఐటీ ఎగుమతులు డబుల్

ఐటీ ఎగుమతులు డబుల్
  • రిపోర్ట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐటీ సెక్టార్ గత ఏడేండ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందని, ఐటీ ఎగుమతులు డబుల్ అయ్యాయని రాష్ట్ర అర్థ,
గణాంక (ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) శాఖ వెల్లడించింది. ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయం తదితర రంగాల్లో చాలా పురోగతి సాధించినట్లు ప్రకటించింది.
ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అర్థ, గణాంక శాఖ ఆఫీసులో ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ – 2021’ రిపోర్టును రాష్ట్ర ప్రణాళికా
సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం
డైరెక్టర్ జి. దయానంద్, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ సెంటర్ అదనపు డీజీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ పి. సౌమ్య, అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రసాద్ రావు, రమణ,
కన్సల్టెంట్ రాంభద్రం పాల్గొన్నారు.  

ఏటా14% వృద్ధిరేటు.. 
ఐటీ ఎగుమతులు 2014-–15 తర్వాత ఏటా 14 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 2014–-15 నుంచి 2020–-21
మధ్య 120 శాతం గ్రోత్ రేట్ నమోదైందని తెలిపారు. 2020 వరకు 6.28 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చూపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ
ఎగుమతుల విలువ రూ.66,276 కోట్లు ఉండగా, 2020– 21 నాటికి అది1,45,522 కోట్లకు పెరిగిందని, ఆరేండ్లలో ఎగుమతుల విలువ
రెట్టింపయ్యిందని పేర్కొన్నారు. 

జీఎస్డీపీలో 93.8% పెరుగుదల  
2020–21 ఏడాదికి గాను తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్డీపీ)ను ప్రస్తుత ధరల్లో 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు.
ఒక రాష్ట్రాభివృద్ధికి జీఎస్డీపీనే లెక్కలోకి తీసుకుంటారు. దాని ప్రకారమే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తారు. 2015–
16లో జీఎస్డీపీ అప్పటి ధరల్లో రూ. 5,77,902 కోట్లు ఉండగా, 2016– 17లో రూ.6,58,325 కోట్లు, 2017–18లో రూ.7,50,050 కోట్లు, 2018–
19లో 8,60,078 కోట్లు, 2019–20లో రూ.9,57,207 కోట్లకు పెరిగింది. 2015–16 నుంచి 2020–21 వరకు పరిశీలిస్తే జీఎస్డీపీలో 93.8 శాతం
పెరుగుదల నమోదైనట్లు నివేదికలో వెల్లడించారు.  

రూ.  26 వేల కోట్లకు ధాన్యం కొనుగోళ్లు   
రాష్ట్ర జనాభాలో 55 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఉపాధి పొందుతున్నారు. 2014 – 15లో 24.29 లక్షల టన్నుల
వడ్లను రూ.3,392.21 కోట్లతో కొనుగోలు చేయగా, 2015 –16లో 23.56 లక్షల టన్నుల ధాన్యాన్ని 3,396 కోట్లతో కొనుగోలు చేశారు. 2016 – 17లో
53.69 లక్షల టన్నులను రూ.8,089 కోట్లతో, 2017–18లో 53.99 లక్షల టన్నులను 8,565 కోట్లతో, 2018 – 19లో 77.46 లక్షల టన్నుల
ధాన్యాన్ని 13,689 కోట్లతో, 2019–20లో 111.26 లక్షల టన్నుల ధాన్యాన్ని 20,383.44 కోట్లతో కొనుగోలు చేశారు. 2020–21లో 141.07 లక్షల
టన్నుల ధాన్యానికి సంబంధించి రూ. 26,608 కోట్ల కొనుగోళ్లు జరిగినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు.