53 రోజుల్లో 119శాతం అధిక వర్షపాతం

 53 రోజుల్లో 119శాతం అధిక వర్షపాతం
  • 2020కి ముందు ఐదేండ్లు లోటే

హైదరాబాద్, వెలుగు: సాధారణంగా వానలు రెండ్రోజులుంటాయి. మరో నాలుగు రోజులు కొనసాగుతాయి. కానీ తెరిపి లేకుండా నెలలో మూడు వారాల పాటు వర్షాలు పడిన సందర్భాలు చాలా అరుదని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. ఈ నెల7న మొదలైన వర్షాలు తెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ములుగు వరకు అతి భారీ వర్షాలు పడ్డాయి. గోదావరికి వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇప్పటికీ జనం ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

జూన్1 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలో 119 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా రెండింతలు నమోదు కావడం చరిత్రలో ఎప్పుడూ లేదని అధికారులు అంటున్నారు.1986లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా.. ఈ స్థాయిలో వానలు పడలేదని చెబుతున్నారు. గత 53 రోజులకు గానూ రాష్ట్ర సగటు వర్షపాతం 286.5 మిల్లీమీటర్లు ఉండగా 627.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రికార్డు అని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆ రికార్డు కూడా మారొచ్చని అంటున్నారు.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 231 శాతం అధికంగా వానలు పడ్డాయి. ఈ జిల్లాలో జూన్ 1 నుంచి జులై 23 వరకు సాధారణ వర్షపాతం 326.3 మిల్లీమీటర్లు ఉండగా, 1080.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన 231 శాతం అధికంగా వాన పడింది. జగిత్యాల జిల్లాలో 216 శాతం, కరీంనగర్ జిల్లాలో 204 శాతం, నిర్మల్ జిల్లాలో 194 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 180 శాతం, ములుగు జిల్లాలో 175 శాతం ఎక్కువగా వర్షపాతాలు రికార్డయ్యాయి. 

మూడేండ్లలోనే మార్పులు
గత పదేండ్ల వాతావరణ చరిత్రను పరిశీలిస్తే గడచిన మూడేండ్లలోనే పెద్దయెత్తున మార్పులు కనిపించాయి. 2015 నుంచి 2019 వరకు వరుసగా ఐదేండ్లు లోటు వర్షపాతాలే నమోదయ్యాయి. 2015లో సాధారణ వర్షపాతం కన్నా  మైనస్ 67 శాతం, 2016లో మైనస్ 2 శాతం, 2017లో మైనస్ 41 శాతం, 2018లో మైనస్18 శాతం, 2019లో మైనస్ 7 శాతం వర్షపాతం నమోదైంది.

ఇక 2020లో ప్లస్ 17 శాతం, 2021లో ప్లస్ 57 శాతం కురవగా, ఈ సీజన్ లో ఇప్పటికే 119 శాతం వర్షపాతాలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కాలుష్యం తగ్గడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో పొల్యూషన్ బాగా తగ్గిందన్నారు.