భూమి కన్నా భారీ గ్రహం.. 13,210 రెట్లు పెద్దది

భూమి కన్నా భారీ గ్రహం.. 13,210 రెట్లు పెద్దది
  • మహా భారీ గ్రహం!
  • మన భూమి కన్నా 13,210 రెట్లు పెద్దది

 విశ్వంలో మన భూమి లాంటి గ్రహాలను వెతికే పనిలో పడిన ఆస్ట్రొనామర్లకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యే ముచ్చట తెలిసింది. ఇప్పటివరకూ ఇతర నక్షత్రాల చుట్టూ మన భూమి కన్నా చాలా రెట్లు పెద్దగా ఉండే ఎక్సో ప్లానెట్లను సైంటిస్టులు గుర్తించారు. కానీ.. ఇప్పుడు కనీసం ఊహకు కూడా అందని రేంజ్ లో.. మహాభారీ గ్రహం జాడను గుర్తించి షాక్ అయ్యారు. అది మన భూమి కన్నా ఏకంగా.. 13,210 రెట్లు పెద్దగా ఉందట. దాని సూర్యుడి చుట్టూ 7,780 కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఆర్బిట్ లో తిరుగుతోందట.

మనకు 325 కాంతి సంవత్సరాల దూరంలో ఆకాశంలో కన్పించే బీటా సెంటారీ అనే నక్షత్రం చుట్టూ ఈ భారీ బీటా సెంటారీ బీ అనే గ్రహం ఉందట. చిలీలో ఉన్న యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ దీనిని గుర్తించింది. టెలిస్కోపులో అమర్చిన స్పియర్ ఇన్ స్ట్రుమెంట్ కరోనాగ్రాఫ్​పద్ధతిలో తీసిన ఫొటో ఆధారంగా ఈ రాకాసి గ్రహం ఊహాచిత్రాన్ని సైంటిస్టులు రూపొందించారు. దీని నక్షత్రం నుంచి భారీ ఎత్తున అల్ట్రా వయెలెట్, ఎక్స్ రే రేడియేషన్ విడుదలవుతుండటంతో ఇంత దూరంలో ఉన్నా, ఇది చాలా వేడిగా ఉందని చెప్తున్నారు. ఒక నక్షత్రం చుట్టూ ఇంత పెద్ద గ్రహం, ఇంత దూరంలో, ఇంత వేడిగా ఉండటం అన్న ఆలోచనే ఇన్నాళ్లు రాలేదని, కానీ విశ్వంలో మనం తెలుసుకున్నది గోరంతేనని ఇది నిరూపించిందని పేర్కొంటున్నారు.