రాహుల్ గాంధీ మాటలను..మోదీ వక్రీకరించడం సిగ్గుచేటు

రాహుల్ గాంధీ మాటలను..మోదీ వక్రీకరించడం సిగ్గుచేటు

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముంబైలో అన్న మాటలను ప్రధాని మోదీ వక్రీకరించడం సిగ్గుచేటని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ మండిపడ్డారు. రాహుల్​వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. సోమవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆదివారం ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ వెనుక ఉన్న ఈవీఎం, ఈడీ, సీబీఐ లాంటి శక్తులతో తాము పోరాడుతున్నామని, అందులో తప్పేముందని నిరంజన్ ప్రశ్నించారు. శక్తి అనే పదాన్ని దైవశక్తి, దుష్టశక్తి అనే రెండు పదాలతో నిర్వచిస్తారన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. మోదీ తన హోదాను మరిచి రాహుల్ మాటలను వక్రీకరించడం తగదన్నారు. అమ్మవారిని శక్తి స్వరూపిణి‌‌గా వారే పూజిస్తున్నట్టు, దేశంలోని తల్లులను, సోదరీమణులను వారే గౌరవిస్తున్నట్టు ఇతరుల‌‌పై బీజేపీ నాయకులు బురదజల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడం అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. ఈ విషయంలో మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌‌కు లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు.