మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగుస్తున్న ఉచ్చు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగుస్తున్న ఉచ్చు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కష్టాలు కొని తెచ్చుకున్నారా..? తాను ఒకటి తలచి చేస్తే .. ఇప్పుడు అది మరోలా తయారైందా? ఎన్నికల సమయంలో చేసిన తప్పిదం ఆయన మెడకు చుట్టుకునేలా ఉందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంపరింగ్ చేశారన్న ఫిర్యాదుపై ఈసీ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల కమిషన్ కు కొందరు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా రెండు అఫిడవిట్లు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినట్టు శ్రీనివాస్ గౌడ్ పై కంప్లైంట్ ఇచ్చారు. లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్ ను వైబ్ సైట్ నుంచి తొలగించి..నెలన్నర తరువాత సవరించిన మరో అఫిడవిట్  అప్ లోడ్ చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలొచ్చాయి. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కైఈసీ వెబ్ సైట్ ను ట్యాంపరింగ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.  దీనిపై సీఈవో కార్యాలయం నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ సీఈవో ఆఫీస్ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ట్యాంపరింగ్ ను టెక్నికల్ బృందం నిజమేనని తేలిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

 2018 నవంబర్ 14న మహబూబ్ నగర్ అసెంబ్లీ సీటుకు శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో మంత్రి అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్ ను ఈసీ వెంటనే తమ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. పోలింగ్ పూర్తయి, ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఈసీ వెబ్ సైట్ లో కొత్త అఫిడవిట్ కనిపించిందని తెలుస్తోంది. ఈ అఫిడవిట్ నవంబర్ 19న  అప్ లోడ్ చేసినట్టు ఈసీ కమిషన్ వెబ్ సైట్లో తెలుస్తోంది. తప్పుడు సమాచారంతో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే..సవరించిన అఫిడవిట్ ను ఈసీ వెబ్ సైట్ ని టాంపరింగ్ చేసి అప్ లోడ్ చేసినట్టు మంత్రిపై ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోని కొందరు అధికారులతో కలిసే..మంత్రి టాంపరింగ్ చేశారన్న ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం విచారణ చేయిస్తోందని సమాచారం. శ్రీనివాస్ గౌడ్, ఆయన భార్య వెహికల్స్ మీదున్న పెండింగ్ చలాన్ల వివరాలు లేకుండానే మొదటి అఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత  పెండింగ్ చలాన్లతో పాటు, తన భార్య తీసుకున్న రుణాల వివరాలతో రెండో అఫిడవిట్ అప్ లోడ్ చేసినట్టు ఫిర్యాదులో ఉంది.

మరిన్ని వార్తల కోసం

సీఎం దత్తత గ్రామంలో అధికారుల పర్యటన

జెండావందనం చేసిన సీఎం కేసీఆర్