గొత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న ప్రయత్నాలను ప్రభుత్వ విరమించుకోవాలి

 గొత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న ప్రయత్నాలను ప్రభుత్వ విరమించుకోవాలి

ముషీరాబాద్, వెలుగు: గొత్తి కోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గొత్తి కోయల పోడు భూముల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్​రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వేములపల్లి వెంకటరామయ్య, శ్రీ రామ్ నాయక్ హాజరై మాట్లాడారు. అడవుల్లో ఉంటున్న ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉంటాయన్న సంగతి కూడా తెలియదన్నారు. వారు అడవే జీవనాధారంగా బతుకుతారన్నారు.

30 ఏండ్ల కింద చత్తీస్ గఢ్ నుంచి గొత్తికోయలు వలస వచ్చారని, కానీ తెలంగాణ రాష్ట్ర గిరిజన తెగల జాబితాలో వారి పేరు లేనంత మాత్రాన జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్​చేశారు. దీనిపై  రాష్ట్రపతి, గవర్నర్, గిరిజన శాఖా మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. ఆర్ అంజయ్య నాయక్, లక్ష్మయ్య, చలపతిరావు, ప్రభాకర్, రాజు నాయక్, మురారి,టి. సాగర్, తుక్కరాం నాయక్  పాల్గొన్నారు.