‘చంద్రవ్వ’తోని అంత వీజీ కాదు

‘చంద్రవ్వ’తోని అంత వీజీ కాదు

 

ఆమె వార్తలు చెప్తుంటె.. పక్కింటి అక్కతోని ముచ్చట్లు పెట్టినట్టు అనిపిస్తది. కోడల్ని ఓ మల్క గట్టిగ అర్సుకుంటుంటే.. మనల్నేబెదిరిస్తున్నట్టు అనిపిస్తది. సొసైటీల జరుగుతన్న కొన్ ని విషయాల మీద అమాయకంగ రియాక్ట్ అయినప్పుడు ‘అయ్యో! పాపం.. అమాయకురాలు’ అనిపిస్తది. అట్ల ఆమె ఏది చెప్పినా.. మనింట్ల మనిషితోని మాట్లాడుతున్నట్టే అనిపిస్తది. ఆమెనే.. ‘తీన్మార్‌‌’ ముచ్చట్లతోని తెలంగాణలోని అన్ని గడపలల్ల అడుగువెట్టిన ఆమే ‘చంద్రవ్వ’. మహిళా దినోత్సవం సందర్భంగ చెప్పిన ముచ్చట్లు.

 

నమస్తే.. చంద్రవ్వ మంచిగున్నవా?

అగో! మంచిగున్నవా అని గట్ల దీర్ఘం తీస్కుంట అడుగుతున్నవ్‌‌‌‌.. నాకేమైంది. కనిపిస్తలేనా గింత మంచిగున్న!

‘చంద్రవ్వ’ సెలబ్రిటీ  స్టేటస్‌‌‌‌ ఎట్ల అనిపిస్తుంది?

అవును.. చంద్రవ్వ పెద్ద సెలబ్రిటీ అయ్యింది. కానీ... నేనైతే ఇంకా కాలే(నవ్వుతూ..). నన్ను సుజాత దీక్షిత్(అసలు పేరు)గా గుర్తుపట్టేటోళ్లు చాలా తక్కువ. చంద్రవ్వ గెటప్‌‌‌‌ల ఉంటే మాత్రం నన్ను అస్సలు షూటింగ్‌‌‌‌ కూడా చేసుకోనియ్యరు జనాలు. ఏడికి పోయినా.. గుర్తుపడుతున్నరు. ఇంతకుముందు తీన్మార్ ప్రోగ్రాంల చేసేవాళ్లతోని నేను సెల్ఫీ తీస్కోవాలె అనుకున్న. ఈ ప్రోగ్రాంలకు వచ్చినంక నాతోనే అందరు సెల్ఫీలు దిగుతున్నరు. కానీ.. ఆ స్టేటస్‌‌‌‌ ఇచ్చే హ్యాపీనెస్‌‌‌‌ కన్నా.. ‘చంద్రవ్వ లెక్క  మంచిగ చేస్తున్నవ్‌‌‌‌’ అని ఎవళ్లన్నా  కాంప్లిమెంట్‌‌‌‌ ఇచ్చినప్పుడు మస్తు సంబురమనిపిస్తది.  పన్నెండేళ్లుగా యాంకరింగ్‌‌‌‌ చేసినా రాని గుర్తింపు ‘చంద్రవ్వ’ వల్ల వచ్చింది.

చంద్రవ్వ చాన్స్‌‌‌‌ ఎట్లొచ్చింది?

వీ6లో తెలంగాణ వాళ్లను బాగా ఎంకరేజ్‌‌‌‌ చేస్తరని తెలిసి 2018లో ఇంటర్వ్యూకి వచ్చిన. ‘ఓకే’ చేసిన్రు. నాతో పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పించిన్రు. అప్పట్లో అనుకున్న ప్రోగ్రాంకి బ్రేక్‌‌‌‌ పడింది. తర్వాత 2019లో ఫోన్‌‌‌‌ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నరు. నేను శనివారం ఇంర్వ్యూకి వచ్చిన. తీన్మార్‌‌‌‌‌‌‌‌ వార్తలు డమ్మీ షూట్‌‌‌‌ కూడా చేసిన్రు. సోమవారం నుంచి ఆఫీస్‌‌‌‌కి రమ్మన్నరు. అయితే.. దానికే సెలక్ట్‌‌‌‌ చేసిన్రా, ఇంకేమన్న ప్లాన్‌‌‌‌ చేసిన్రా అనేది మాత్రం తెల్వదు. తర్వాత రోజు ఆదివారం గోల్కొండల బోనాల పండుగ. అక్క పిల్లలు, అన్నల పిల్లలు మొత్తం పదిమందిని తీస్కొని అక్క, నేను పోయినం.  పిల్లల్ని కంట్రోల్‌‌‌‌ చేస్తానికి ఇద్దరం పొద్దంత అరుస్తనే ఉన్నం. దాంతో డస్ట్‌‌‌‌ అంతా గొంతులకు పోయింది. తెల్లారేసరికి గొంతు బొంగురుపోయింది. ఇగ.. వీ6 ఆఫీస్‌‌‌‌కి ఫోన్‌‌‌‌ చేసి, ‘నేను ఇవ్వాళ రాలేను. వారం టైం కావాల’న్నా. సరే అన్నరు. కట్‌‌‌‌ చేస్తే.. తీన్మార్‌‌‌‌‌‌‌‌ వార్తలు రాధ చదువుతోంది. నా గొంతు మంచిగైనంక ఫోన్‌‌‌‌ చేస్తే.. రమ్మన్నరు. ‘చంద్రవ్వ’ని చేసిన్రు. 

రాధ ప్లేస్‌‌‌‌ మిస్‌‌‌‌ అయిన అని ఫీల్ అయితున్నవా?

అఫ్‌‌‌‌కోర్స్‌‌‌‌ మొదట్ల మస్తు ఫీల్‌‌‌‌ అయిన. రాధ ప్లేస్‌‌‌‌ల కూర్చొని అన్ని వార్తలు చెప్పాల్సిన నేను ఇట్ల రోజుకు ఒకటే వార్త చెప్తున్నా అనుకునేదాన్ని. అదీగాక.. ముప్పైలో ఉన్న నన్ను యాభై ఏళ్ల ఆమె లెక్క చూపిస్తున్నరని చిన్న బాధ ఉండేది. కానీ.. బాలాపూర్‌‌‌‌‌‌‌‌ లడ్డూ ప్రోగ్రాం చేసినంక వచ్చిన క్రేజ్‌‌‌‌తో ఆ ఫీలింగ్ మొత్తం పోయింది. ఇచ్చిన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ని కరెక్ట్‌‌‌‌గా చేస్తే గుర్తింపు దానంతట అదే వస్తదని నా విషయంల రుజువయ్యింది. ఏ పని చేసినా.. నన్ను నేను ఎప్పుడూ ప్రూవ్‌‌‌‌ చేసుకుంటనే ఉంట. మా మధ్య హెల్దీ కాంపిటేషన్‌‌‌‌ ఉంటది.

పుట్టి, పెరిగింది ఎక్కడ?

మా నాన్న రామస్వామి సంగారెడ్డిలో సంగీతం మాస్టారు. నేను పుట్టి, పెరిగింది కూడా అక్కడే.  వాళ్ల సొంతూరు వరంగల్‌‌‌‌ జిల్లాలోని జనగాం. అమ్మ ఆర్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ క్రాఫ్ట్స్‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌. స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ సంగారెడ్డిలోనే. ఇంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి సిటీలో చదువుకున్న. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క. నాన్న అందరికీ సంగీతం నేర్పించిన్రు. నాది బేస్‌‌‌‌ వాయిస్‌‌‌‌. అందుకే నాకు డాన్స్‌‌‌‌ నేర్పించిన్రు. హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ యూనివర్సిటీల మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫర్మామింగ్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ (ఎంపీఏ) కూచిపూడిలో చేసిన.

డాన్స్‌‌‌‌ నేర్చుకుని, యాంకరింగ్‌‌‌‌ వైపు రూట్‌‌‌‌ ఎట్ల మారింది?

యాక్చువల్లీ నేను పెద్ద డాన్సర్‌‌‌‌‌‌‌‌ని కావాలని కలలు కన్న. శోభానాయుడి లెక్క పెద్ద పేరు తెచ్చుకోవాలనుకున్న. ఎంఫిల్‌‌‌‌ చేసేటప్పుడు బయట పిల్లలకు డాన్స్‌‌‌‌ క్లాసులు చెప్పిన. ఆ టైంలనే యూనివర్సిటీల నందీశ్వర్‌‌‌‌‌‌‌‌ అని నా జూనియర్‌‌‌‌‌‌‌‌ ఒకబ్బాయి ఉండేటోడు. తను ఏదో కాంపిటీషన్‌‌‌‌ కోసం హెచ్‌‌‌‌సీయూ స్టూడెంట్స్‌‌‌‌తో అంత్యాక్షరి ఆడించిండు. ఆ ప్రోగ్రాంకి నేను హోస్ట్‌‌‌‌గ చేసిన. ఆ తర్వాత నందీశ్వర్‌‌‌‌‌‌‌‌ ‘జీ తెలుగు’లో జాబ్ కోసం అప్లై చేసిండు. వాళ్లు ఇంతకుముందు నువ్వు చేసిన వర్క్‌‌‌‌ ఏమన్న ఉంటే చూపియ్యమని అడిగిన్రట. అతను ఆ అంత్యాక్షరి వీడియో చూపించిండు. అందులో నన్ను చూసి ‘జీ తెలుగు’వాళ్లు ఫస్ట్ ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన్రు. అట్ల 2006లో ‘జస్ట్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ యు’ ప్రోగ్రాం చేసిన. ఆ తర్వాత చాలా ఛానెల్స్‌‌‌‌ల పనిచేసిన.

తెలంగాణ యాసలు బాగా మాట్లాడుతున్నవు? 

మా నాన్నది వరంగల్‌‌‌‌ జిల్లా జనగాం. అమ్మవాళ్లది నిజామాబాద్‌‌‌‌ అయితే.. హైదరాబాద్‌‌‌‌లో సెటిల్‌‌‌‌ అయ్యిన్రు. నేను ఉంటున్నది కూడా హైదరాబాదే. అందుకే ఈ మూడు యాసలు బాగా మాట్లాడుత. ఒక ఛానెల్‌‌‌‌ల ప్రోగ్రాం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో పనిచేసిన. అట్ల తెలంగాణ యాసపై పట్టొచ్చింది. అయినా.. ఇప్పటికీ నేను నేర్చుకుంటనే ఉన్న.
యాక్టింగ్‌‌‌‌ కూడా బాగ చేస్తవ్‌‌‌‌. నేర్చుకున్నవా?

అది మా మెట్టినింటి నుంచి వచ్చిన స్కిల్‌‌‌‌ అనే చెప్పాలె. మా మామయ్య డీఎస్‌‌‌‌ దీక్షిత్‌‌‌‌, అత్తయ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టులు. మామయ్య యాక్టింగ్ నేర్పిస్తరు. దాదాపు వంద సినిమాల్లో, చాలా సీరియళ్లలో నటించిన్రు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్‌‌‌‌ చేసేటోళ్లు. మా ఆయన శ్రీధర్‌‌‌‌‌‌‌‌ దీక్షిత్‌‌‌‌ డైరక్షన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్నరు. వాళ్ల ఎంకరేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ వల్లనే నేను ‘పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ’లో రంగస్థల కళల్లో పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌‌‌ చేసిన. ఇదివరకు బాపూగారి సీరియల్‌‌‌‌ ‘వేంకటేశ్వర వైభవం’లో నటించిన. కొన్ని సినిమాల్లో కూడా చేస్తున్న. నాటకాలు వేసిన. 

యాక్టింగ్‌‌‌‌, యాంకరింగ్‌‌‌‌.. ఏది బాగా తృప్తినిచ్చింది?

యాక్టింగ్‌‌‌‌ ఒక స్కిల్‌‌‌‌. యాంకర్‌‌‌‌‌‌‌‌కి యాక్టింగ్‌‌‌‌తో పాటు చాలా క్వాలిటీస్‌‌‌‌ ఉండాలె. అందులో నేను సక్సెస్‌‌‌‌ అయిన కాబట్టే ఇన్ని చాన్స్‌‌‌‌లు వచ్చినయ్‌‌‌‌. ‘చంద్రవ్వ’ అవకాశం కూడా అట్లొచ్చిందే. కాబట్టి నన్ను ఇక్కడ నిలబెట్టింది యాంకరింగే. కానీ.. ‘చంద్రవ్వ’ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ వల్లనే ఫర్మామెన్స్‌‌‌‌కి స్కోప్‌‌‌‌ దొరికింది.

జానపదాలు బాగా పాడతవు..

నాది బేస్‌‌‌‌ వాయిస్‌‌‌‌ కాబట్టి ఫోక్‌‌‌‌ సాంగ్స్‌‌‌‌కి బాగా సరిపోతది. అందుకే నేర్చుకున్న. నేను ఇంతకుముందు చేసిన ఫోక్‌‌‌‌ సాంగ్స్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌ తోని కూడా కొన్ని పాటలు నేర్చుకున్న.

తీన్మార్ వల్ల చాలా బిజీ అయిపోయినట్టుంది?

నాకు కుటుంబం, పని తప్ప ఇంకేం వ్యాపకాలు లేవు. వర్క్‌‌‌‌ లేకుంటే కచ్చితంగా ఫ్యామిలీతోనే ఉంట. మా అమ్మ, అత్తగారిళ్ల నుంచి ఫుల్‌‌‌‌ సపోర్ట్. వర్క్‌‌‌‌ బిజీలో ఉండి ఫంక్షన్లకు పోకపోయినా అర్థం చేసుకుంటరు. 

ఇంకేమన్న గోల్స్‌‌‌‌ ఉన్నయా?

ఎంత సాధించినా.. సాధించాల్సింది ఇంకా ఏదో ఉంటది! నేను ఇప్పటివరకు నాలుగు పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, ఒక ఎంఫిల్‌‌‌‌ చేసిన. ఎప్పటికైనా థియేటర్ ఆర్ట్స్లో పీహెచ్‌‌‌‌డీ కంప్లీట్‌‌‌‌ చేయాలె.  డాక్టర్‌‌‌‌‌‌‌‌ సుజాత అని పిలిపించుకోవాలనేది నా కోరిక. ఇక ప్రొఫెషన్‌‌‌‌ విషయానికొస్తే.. ఫిల్మ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుంది.

సుజాతలో కూడా చంద్రవ్వ ఉన్నట్లుంది..?

కచ్చితంగా ఉంది. చంద్రవ్వ, సుజాతలో ఉన్న కామన్ పాయింట్‌‌‌‌ జనాలకు ‘‘అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌” కల్పించాలి అనుకోవడం. నా ముందు ఎవ్వళు తప్పు చేసినా.. సహించ. అక్కడే నిలదీసి అడుగుత. ఎవరైనా ఫుడ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ చేసినా, కాటన్ వేస్ట్ చేసినా మస్తు కోపమొస్తది. అట్లాంటివాళ్లను వెంటనే కడిగిపారేస్త.

ఇంత గుర్తింపు తెచ్చిన ‘‘చంద్రవ్వ’’ క్యారెక్టర్ గురించి...

వీ6 న్యూస్‌‌‌‌ సీఈవో అంకం రవి సర్‌‌‌‌‌‌‌‌ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘చంద్రవ్వ’. ఆమె మాట తీరు, నడుచుకునే విధానం అన్నీ ఆయన క్రియేషనే. ‘ఈ రోజు ఏ ముచ్చట మీద చంద్రవ్వ మాట్లాడాలె’ అని డిసైడ్‌‌‌‌ చేసేటందుకు ఏరోజుకు ఆ రోజు రీసెర్చ్‌‌‌‌ నడుస్తనే ఉంటది. ఈ రోజు కరెంట్ ఇష్యూస్‌‌‌‌ ఏమున్నయ్‌‌‌‌? జనాలకు ఏ ఇష్యూ మీద అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ కల్పించాలె? అనేది డిసైడ్‌‌‌‌ చేసి.. ఏ విషయాన్ని ఎవరితో చెప్పిస్తే జనాలకు రీచ్‌‌‌‌ అయితదో వాళ్లతోనే చెప్పిస్తరు. అందుకే తీన్మార్ ఇంత సక్సెస్‌‌‌‌ అయ్యింది.