అక్కడ ప్రతి శుభకార్యం ప్రకృతితో ముడిపడి ఉంటుంది

అక్కడ ప్రతి శుభకార్యం ప్రకృతితో ముడిపడి ఉంటుంది

కనుచూపు మేర ఎడారిగా ఉన్న ప్రాంతంలో నీటి చెలమ కనిపిస్తే ఎలా ఉంటుంది? ప్రాణం పోయే పరిస్థితిలో ఊపిరి పోసినట్లు ఉంటుంది. భూటాన్ దేశం కూడా అంతే.. ఎడారిలో ఒయాసిస్​ లాంటిది. ఇప్పటికే పర్యావరణ మార్పుల వల్ల ఎన్నో విపత్తులు ఎదుర్కొంటోంది ప్రపంచం. వాటినెలా ఆపాలి? భూమిపై మనుగడ ఎలా? అని పరిష్కార మార్గాలు వెతుక్కుంటున్నాయి ప్రపంచదేశాలు. ఈ పరిస్థితుల్లో భూటాన్​ను చూస్తే ఆశలు చిగురించడం ఖాయం. భూటాన్​ ప్రయత్నాల గురించి తెలుసుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది. 

భూటాన్‌‌లో 60 శాతం భూభాగం అటవీ ప్రాంతం ఉండాలని వాళ్ల రాజ్యాంగంలో రాసుకున్నారు. దాంతో ప్రస్తుతం భూటాన్​లోని అటవీ భాగం72 శాతంగా ఉంది. అదెలా? అంటారా.. అక్కడ ప్రతి శుభకార్యం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు 2016లో భూటాన్​ రాజుకి బుల్లి యువరాజు పుట్టిన సందర్భంగా1,08,000 చెట్లు నాటారు అక్కడి ప్రజలు. అలా వేడుకలను కూడా ప్రకృతిని కాపాడేలా చేసుకుంటారు వాళ్లు. ప్రతి దేశం స్థూల జాతీయ ఉత్పత్తిని బట్టి అభివృద్ధిని కొలుస్తుంది. కానీ, ఆర్థికాభివృద్ధి దేశ సంస్కృతిని, విలువల్ని కాపాడలేదని భూటాన్​ నమ్ముతుంది. అందుకే భూటాన్​ జీఎన్​పి 2 బిలియన్​ డాలర్లు మాత్రమే. అంటే... మనదేశ కుబేరుడైన ముకేశ్​ అంబానీ నెట్​ వర్త్​(18.9 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే చాలా తక్కువ. 

భూటాన్​ రాజ్యాంగం ప్రకారం, అభివృద్ధి అంటే.. విలాసవంతమైన జీవితం, సకల సౌకర్యాలు, ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ ఆదాయం, విశాలమైన ఇండ్లు, పెద్ద రోడ్లు, ఖరీదైన వెహికల్స్, టెక్నాలజీతో కలిసి పరుగులు తీయడం కాదు. అభివృద్ధి అంటే.. ప్రజల సంతోషం, ప్రకృతితో కలిసి జీవించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం. భారత్, చైనా మధ్య ఉన్న హిమాలయాల ప్రాంతంలో ఉంది భూటాన్. ఈ దేశం తమ సంస్కృతి, సంప్రదాయాలను చాలా గౌరవిస్తుంది. స్త్రీలను చాలా గౌరవిస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో తండ్రి చనిపోతే అతని ఆస్తి పెద్ద కూతురికి చెందుతుంది. కొడుకులకు మాత్రం చిల్లిగవ్వ కూడా రాదు. 

భూటాన్ సంప్రదాయాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో1974 వరకు టూరిస్ట్​లను అనుమతించేవాళ్లు కాదు. ప్రస్తుతం టూరిస్ట్​లను అనుమతిస్తున్నారు. అయితే, అక్కడి స్థానిక ప్రజల కల్చర్​ని ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో టూరిస్ట్​లకు చాలా కండిషన్స్ ఉంటాయి. 1991 తర్వాతే టీవీ, ఇంటర్నెట్​ భూటాన్​ ప్రజలకు పరిచయమయ్యాయి. ఈ దేశంలో పాలన రాజు చేతిలో ఉంటుంది. ఇక్కడ అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తారు. ఇండ్లు లేనివాళ్లకు ఇండ్లు కట్టుకోవడానికి, ఎవుసం చేసుకోవడానికి స్థలం ఇస్తాడు రాజు.

ఎవుసం పూర్తిగా ఆర్గానిక్​ పద్ధతిలో చేస్తారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారు. కార్బన్ –డై –ఆక్సైడ్ తగ్గించేందుకు హైడ్రో ఎలక్ట్రిసిటీ వాడతారు. ఎల్​ఈడీ లైట్స్, ఎలక్ట్రిక్ కార్లు వాడేందుకు సబ్సిడీ ఇస్తారు. భూటాన్​లో వేట, మైనింగ్, కాలుష్యానికి కారణం కాకూడదనే రూల్స్ ఉన్నాయి. పార్క్​లు మెయింటెయిన్ చేసి, ఆదాయం పొందడానికి గవర్నమెంట్ సాయం చేస్తుంది. ఇక్కడ పొగాకు నిషేధం. ప్రపంచంలో పొగాకును పూర్తిగా బ్యాన్ చేసిన దేశం భూటాన్​. 

ప్రపంచంలో ప్రతి దేశం ఇతర దేశాల జీడీపీతో పోల్చుకుని డెవలప్​మెంట్​ను పోల్చుకుంటుంది. భూటాన్​ మాత్రం ప్రజల సంతోషమే దేశాభివృద్ధిగా భావిస్తుంది. ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఈ శాఖ దేశ గ్రాస్​ నేషనల్ హ్యాపీనెస్(జీఎన్​హెచ్)ను సర్వే చేస్తుంటుంది. ఒక సర్వేలో ఆ దేశప్రజలు 90 శాతానికి పైగా ఆనందంగా ఉన్నట్లు వెల్లడైంది.

కార్బన్ ఫుట్ ప్రింట్

భూటాన్ కార్బన్​ నెగెటివ్ దేశం. దీని గురించి తెలుసుకునే ముందు అసలు కార్బన్​ ఫుట్ ప్రింట్​ గురించి తెలుసుకోవాలి. ప్రతి మనిషి, వాళ్లు చేసే పనుల వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కార్బన్​ విడుదల​కు కారణమవుతున్నాడు. అవి... కట్టెలు కాల్చడం, ఇండస్ట్రీ నుంచి వచ్చే గ్రీన్ హౌస్​ వాయువుల విడుదల, కార్లు, ఫ్లైట్లు నడపడం, మాంసం తినడం వల్ల కూడా కార్బన్​ని ప్రకృతిలోకి విడుదల చేస్తున్నాం. అంటే.. పర్యావరణాన్ని నాశనం చేయడంలో మనం భాగస్వాములు అవుతున్నాం. అంతేకాకుండా ఇండస్ట్రియలైజేషన్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ వంటివి దేశంలో విడుదలైన మొత్తాన్ని కార్బన్​ ఫుట్ ప్రింట్​ అంటాం. దాన్నే CO2గా టన్నుల్లో కొలుస్తారు. 2013 లెక్కల ప్రకారం, చైనా10.5 మిలియన్​ కిలో టన్నుల గ్రీన్​హౌస్ ఎమిషన్స్ విడుదల చేసింది. అంటే ఒకటింపావు వంతు గ్లోబల్ కార్బన్​ ఫుట్ ప్రింట్ కంటే ఎక్కువ! అలాగే మనదేశం నాలుగో అతి పెద్ద కార్బన్​ ఫుట్ ప్రింట్​గా ఉంది. మనదేశం 2.3 మిలియన్ కిలో టన్నుల ఎమిషన్స్ విడుదల చేసింది. అయితే, భూటాన్.. ఇండియా, చైనాల మధ్యలో ఉంది. కాబట్టి, ఎంతైనా భూటాన్ లోని 7 లక్షల మంది ప్రజల ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉంది. 

డెవలప్​ అయిన, అవుతున్న దేశాలు పర్యావరణంలోకి వదిలే కార్బన్​ ఎమిషన్స్​ వల్ల భూమి వేడెక్కుతోంది. దానివల్ల హిమాలయాల్లోని గ్లేసియర్స్ కరిగిపోతున్నాయి. ఇవి కరిగిపోవడం వల్ల మొదట నష్టపోయేది భూటాన్. ఒక్క గ్లేసియర్​ కరిగితేనే వరదలు వచ్చి నీట మునిగాయి ఊళ్లు. కొండ చరియలు విరిగిపడ్డాయి. మరి భూటాన్​కు పైన 2,700 గ్లేసియర్స్​ ఉన్నాయి. అవన్నీ కరిగితే భూటాన్​ పరిస్థితి ఏంటి? 

కార్బన్​ నెగెటివ్ దేశం

ఒక దేశం కార్బన్​ –డై– ఆక్సైడ్​ను ఎంత ఉత్పత్తి​ చేస్తుందో అదంతా పీల్చుకోవడానికి అవసరమైనన్ని అడవులు ఉంటే ఆ దేశాన్ని కార్బన్​ న్యూట్రల్ దేశం అంటారు. అంటే, అయితే, భూటాన్​ కార్బన్​ న్యూట్రల్ దేశం కాదు. కార్బన్​ నెగెటివ్ దేశం. అంటే... ప్రొడ్యూస్​ చేసినదానికంటే ఎక్కువ కార్బన్​ –డై– ఆక్సైడ్ పీల్చుకునేటన్ని అన్ని అడవులు ఉన్నాయి అక్కడ. భూటాన్ ఏడాదికి 2.2మిలియన్​ టన్నుల కార్బన్​ –డై– ఆక్సైడ్​ను ప్రొడ్యూస్​ చేస్తోంది. దాన్ని పీల్చుకునేందుకు అడవులు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని కార్బన్​ న్యూట్రల్ కాదు, కార్బన్​ నెగెటివ్​ దేశం అంటారు. భూటాన్​లో విడుదలయ్యే కార్బన్​ –డై– ఆక్సైడ్​నే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచి విడుదలవుతున్నవి కూడా పీల్చుకుంటున్నాయి అక్కడి అడవులు. ఒక్కమాటలో చెప్పాలంటే నాలుగు మిలియన్​ టన్నుల వాయువును పీల్చుకుంటున్నాయి అక్కడి చెట్లు. అంతేకాకుండా, భూటాన్​లో విడుదలయ్యే హైడ్రో ఎలక్ట్రిసిటీని ఇతర దేశాలకు ఎక్స్​పోర్ట్ చేస్తుంది. దానిద్వారా ఆ దేశాల్లో కరెంట్​ ఉత్పత్తితో ఏర్పడే కార్బన్​ ఎమిషన్స్​ను దాదాపు 6 మిలియన్​ టన్నులు తగ్గిస్తుంది. సొంతలాభం చూసుకోకుండా పొరుగు దేశాలను కూడా కాపాడటంలో ముందుంది భూటాన్. కానీ... ప్రపంచదేశాలు చేస్తున్న పనులు భూటాన్​నే లేకుండా చేసేలా ఉన్నాయి. 

ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ క్లైమేట్ ఛేంజ్​, అవేర్​నెస్ ప్రోగ్రామ్స్​లో ​పాల్గొంటాయి. అక్కడ భూమి వేడెక్కడానికి కారణాలు తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరు  నెపం వేసుకుంటారు. చివరికి కార్బన్​ న్యూట్రల్ దేశాలుగా మారతామని ప్రతిజ్ఙ చేస్తారు. కానీ అది అప్పటివరకే.. తర్వాత దాని గురించి పట్టించుకోరు. కోస్టారికా, న్యూజిలాండ్ వంటి చిన్న దేశాలు త్వరలోనే కార్బన్ న్యూట్రల్ దేశాలుగా మారనున్నాయి. ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తున్న మొదటి ఐదు దేశాల జాబితాలో చైనా 30 శాతం, అమెరికా15 శాతం, ఇండియా 7 శాతం, రష్యా 5 శాతం, జపాన్ 4శాతం ఉన్నాయి. అయితే, ఈ దేశాలు మాత్రం వాయిదాలు వేసుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. 
భూటాన్​ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలు చూపిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అన్నదానికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఈ బుల్లి దేశం వైపు చూసేలా చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణపై దృష్టిపెడితే... రాబోయేవన్నీ మంచిరోజులే అవుతాయి. 

బయోలాజికల్ కారిడార్స్

మనుషులు ఒక ఊరి నుంచి మరో ఊరికి జర్నీ చేసేందుకో, ఆ ఊళ్లో ఉన్న బంధువుల్ని కలవడానికో వెళ్లడం కోసం రోడ్లు ఉన్నట్లే జంతువులకు కారిడార్స్ వేశారు భూటాన్​లో. అంటే.. అడవిలో నివసించే జంతువులు వేరే అడవికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన అడవి మార్గమే ఈ కారిడార్. జంతువుల సౌకర్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. భూటాన్​లో1999లో మొదటిసారి బయోలాజికల్ కారిడార్స్ ఏర్పాటుచేశారు. ఇలాంటివి పన్నెండు ఉన్నాయి. వాటిలో మూడు 2008లో వాంగ్​చుక్​ సెంటెన్నియల్ నేషనల్​ పార్క్​లో కలిసిపోయాయి. అక్కడక్కడా అడవులు, వాటిని కలుపుతూ కారిడార్లు ఉంటాయి. దాంతో ఒకచోట నుంచి మరో చోటుకి జంతువులు వెళ్లడం ఈజీ అవుతుందన్నమాట. అడవుల్ని, అందులో నివసిస్తున్న జంతుజాలాన్ని కాపాడేందుకు భూటాన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. జియో ట్యాగింగ్ చేసి వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు కూడా. అందుకే ఇప్పటికీ అక్కడ అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు కనిపిస్తాయి.

పులుల సంఖ్య పెంచాయి

పులులు అంతరించిపోతున్న టైంలో ఈ కారిడార్ల వల్ల వాటి సంఖ్య పెరిగింది. 2014 –15 భూటాన్ నేషనల్ టైగర్ సర్వేలో మొదటిసారి పులులు కారిడార్స్​ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాయి. వీటివల్ల వాటి సంఖ్య పెరిగింది.1998లో 75 పులులు ఉంటే అవి 2015 నాటికి103కి పెరిగాయని అంచనా. ఏడాదికి ఒక పులి చొప్పున పెరుగుతోందని ఫారెస్ట్​ మేనేజ్​మెంట్ చెప్తోంది. దాంతో పులులు ఉండే13 దేశాల్లో ఒకటి అయింది భూటాన్​. 72 శాతం దేశం అడవితో నిండిపోవడం, 50 శాతం సురక్షిత ప్రాంతం కావడం వల్లే పులులు సురక్షితంగా ఉన్నాయి అక్కడ. అంతేకాదు, ప్రపంచంలోనే100 మీటర్ల నుంచి 4,200 మీటర్ల సముద్ర మట్టానికి పైన పులులు నివసిస్తున్న ప్రాంతం ఒక్క భూటాన్ మాత్రమే​.

పారిస్ అగ్రిమెంట్ ఏంటి?

వాతావరణంలో వస్తున్న మార్పులు, అవి తెస్తున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు డిసెంబర్​ 12, 2015లో ఒక కాన్ఫరెన్స్​ జరిగింది. ఫ్రాన్స్​ రాజధాని పారిస్​లో జరిగిన ఈ భేటీకి 190కి పైగా దేశాలు వచ్చాయి. అందులో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే ‘పారిస్ అగ్రిమెంట్​’ అంటారు. ఈ అగ్రిమెంట్​ లక్ష్యం.. గ్లోబల్ వార్మింగ్​ను అదుపు చేయడం. అంటే.. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల రెండు డిగ్రీల సెల్సియస్​ కంటే తక్కువ లేదా1.5 డిగ్రీల సెల్సియస్​ల లిమిట్​ దాటకుండా చూసుకోవడం. దానిలో భాగంగా ఇంకో యాభై ఏండ్లపాటు గ్రీన్​హౌస్ గ్యాస్ ఎమిషన్స్​ పెరిగినా.. వాతావరణంలోని కార్బన్​ను న్యూట్రల్ అయ్యే పరిస్థితుల్ని తీసుకురావాలనే టార్గెట్ పెట్టుకున్నాయి. 

‘పారిస్​ అగ్రిమెంట్​’ ఏం చేస్తుందంటే.. వివిధ దేశాల్లో జరుగుతోన్న క్లైమెట్ యాక్షన్స్ ఐదేండ్ల కాలంలో ఎంత పెరిగాయో పరిశీలిస్తుంది. 2020లో చాలా దేశాలు వాళ్ల క్లైమెట్ యాక్షన్స్ ప్లాన్స్​ ఇచ్చాయి. అలాగే గ్రీన్​హౌస్ గ్యాస్ ఎమిషన్స్​ తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాయి. అయితే, దీనికి అవసరమైన సాయాన్ని పారిస్​ అగ్రిమెంట్​ ఇస్తుంది. ఆ దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా సపోర్ట్​ అందిస్తుంది. పారిస్​ అగ్రిమెంట్​ ప్రకారం.. ఈ దేశాలన్నీ ఎన్​హ్యాన్స్​డ్ ట్రాన్స్​పరెన్సీ ఫ్రేమ్​ వర్క్ (ఈటీఎఫ్​) ఏర్పాటు చేసుకోవాలి. దీని ఆధీనంలో 2024 మొదలు తాము తీసుకున్న చర్యల గురించి ఈ దేశాలన్నీ కచ్చితమైన రిపోర్ట్​ అందించాలి. దీన్ని రివ్యూ చేసేందుకు ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్​ రిపోర్ట్​ కూడా అందులో ఉండాలి. ఆ సమాచారాన్ని తీసుకున్న ఈటీఎఫ్​.. రాబోయే రోజుల్లో క్లైమెట్​ యాక్షన్స్​ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది.

::: మనీష పరిమి