గవర్నర్​ కోటా ఎమ్మెల్సీగా తెరపైకి కొత్త పేరు!

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీగా తెరపైకి కొత్త పేరు!
  •     సియాసత్​ఎడిటర్​ జాహెద్​అలీ ఖాన్​కు చాన్స్
  •     హైకమాండ్​వద్ద ప్రపోజల్​పెట్టిన పార్టీ రాష్ట్ర నేతలు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. గవర్నర్ ​కోటా కింద ఓ సీనియర్​ జర్నలిస్టుకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్​పార్టీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఉర్దూ పత్రిక సియాసత్​ ఎడిటర్​ఇన్​చీఫ్ ​జాహెద్​అలీ ఖాన్​ను గవర్నర్​కోటా ఎమ్మెల్సీగా నామినేట్​చేయాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ ఆయన కాకపోతే ఆయన కుమారుడు ఆమిర్​అలీ ఖాన్​కు ఆ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలిసింది.

ఇప్పటికే ఈ ప్రతిపాదనను హైకమాండ్​ దృష్టికి పార్టీ రాష్ట్ర పెద్దలు తీసుకెళ్లినట్టు పార్టీకి చెందిన ఓ సీనియర్​లీడర్​ఒకరు చెప్పారు. జర్నలిస్టుగా కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తున్న జాహెద్​అలీ ఖాన్​కు గవర్నర్​ కోటా కింద అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. 2009లో ఆయన ఇండిపెండెంట్​అభ్యర్థిగా హైదరాబాద్​పార్లమెంట్​స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో మహాకూటమి ఆయనకు మద్దతిచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఇటు జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలు, రాజకీయాల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు పార్టీ పెద్దలు ఆసక్తి చూపించినట్టు తెలిసింది. అయితే, గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయాలని అనుకున్నా.. ఆయన ఆసక్తి చూపించలేదట. లో ప్రొఫైల్​మెయింటెయిన్​చేయడానికే ఆయన ఇష్టపడుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆయన కాకుంటే ఆయన కుమారుడైన ఆమిర్​ అలీ ఖాన్​కైనా అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.