
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ లేఆఫ్స్ వేగవంతం చేసింది. ఇటీవల భారత్‌లో కంపెనీ చేపట్టిన లేఆఫ్స్ టెక్ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. కంపెనీ గ్లోబల్ లెవెల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టగా.. ఈ నిర్ణయం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెట్టుబడులల్లో భాగంగా తీసుకున్నదిగా తెలుస్తోంది.
ఒరాకిల్ భారత్‌లో సుమారు 30,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల వందలాది మందిని లేఆఫ్ చేసినట్టు వెల్లడైంది. కేవలం 20 నిమిషాల జూమ్ కాల్ లో కంపెనీ తనను లేఆఫ్ చేసినట్లు తన మేనేజర్, హెచ్ఆర్ చెప్పారని ఒక ఉద్యోగి వెళ్లడించాడు. వెంటనే తనకు సిస్టమ్ యాక్సెస్ తొలగించారని చెప్పారు. మరో ఉద్యోగి హెచ్ఆర్ కాల్ చేసి నేరుగా తొలగింపు ప్యాకేజీ గురించి వివరించి కాల్ ముగించారని అన్నారు. కంపెనీలోని క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ టీమ్‌లపై లేఆఫ్స్ ప్రభావం చూపాయని తెలిసింది.
టెక్నికల్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ టీం, క్లౌడ్ డివిజన్లు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. లేఆఫ్ ప్రక్రియలో ప్రభావితమైన ఉద్యోగులందరికీ వర్తించే విధంగా, రెండు నెలల జీతంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీ, ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతం, గ్రాచ్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ లాంటి బెనిఫిట్స్ ఒరాకిల్ ఇచ్చినట్లు తేలింది. కంపెనీ వ్యాపార కారణాల వల్ల లేఆఫ్ చేస్తున్నట్లు ప్రభావిత ఉద్యోగులకు తెలిపింది.
లేఆఫ్స్ ప్రాధానంగా కంపెనీ AI టూల్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నదనే సంకేతాలిస్తున్నాయి. ఉద్యోగులు తమ పని గంటల్లో AI టూల్స్ వినియోగాన్ని ట్రాక్ చేయడం, “AI-readiness” మెట్రిక్‌లపై కొత్త మాప్‌లతో ఒత్తిడి పెంచినట్టు సమాచారం. మెుత్తానికి సడెన్ జాబ్ కట్స్ ఒరాకిల్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చని చాలా మంది టెక్కీలు అంటున్నారు.