ఐటీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి.. ఆటో నడుపుతోంది! లేడీ డ్రైవర్ రియల్ స్టోరీ వైరల్

ఐటీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి.. ఆటో నడుపుతోంది! లేడీ డ్రైవర్ రియల్ స్టోరీ వైరల్

సమాజంలో హోదా, పెద్ద జీతం, ఐటీ ఉద్యోగం ఉంటేనే సక్సెస్ అనుకుంటారు చాలామంది. ఈ ఆడంబరాలు ఇచ్చే గుర్తింపు కంటే మనశ్శాంతే ముఖ్యం అని నిరూపించింది ఒక మహిళా ఆటో డ్రైవర్. తొమ్మిదేళ్ల పాటు ఐటీ కంపెనీలో మేనేజర్‌గా కార్పొరేట్ ప్రపంచంలో చక్రం తిప్పిన ఆమె.. ఆ ఒత్తిడిని భరించలేక ఉద్యోగానికి రిజైన్ చేసి, ఇప్పుడు ఆటో స్టీరింగ్ పట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ అనే మహిళా ఎంట్రప్రెన్యూర్ ఒకరోజు సాధారణంగానే ఆ ఆటో ఎక్కారు. ప్రయాణంలో భాగంగా ఆ మహిళా డ్రైవర్‌తో క్యాజువల్‌గా మాట్లాడటం మొదలుపెట్టారు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఈ రంగంలోకి ఎందుకు వచ్చారని అడిగినప్పుడు.. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం విని నెజ్రిన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎంతమాత్రం బెరుకు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్‌గా ముఖంపై చెరగని చిరునవ్వుతో ఆటో డ్రైవర్ తన గతాన్ని పంచుకుంది.

తాను గతంలో 9 ఏళ్ల పాటు ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశానని వెల్లడించింది. కార్పొరేట్ లైఫ్‌లో నిరంతరం ఉండే టెన్షన్లు, వర్క్ ప్రెజర్, డెడ్‌లైన్ల ఒత్తిడితో విసిగిపోయి.. ఆ లగ్జరీ లైఫ్‌ను వదిలేసి బయటకు వచ్చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత ఎవరి కిందో పనిచేయడం ఇష్టం లేక, తన సొంత ఆటో కొనుక్కుని డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుందట. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60వేల వరకు సంపాదిస్తున్నానని.. అన్నింటికంటే ముఖ్యంగా ఎంతో హ్యాపీగా, ప్రశాంతంగా బతుకుతున్నానని గర్వంగా చెప్పింది.

ఈ హార్ట్ టచింగ్ వీడియోను నెజ్రిన్ మిధ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ప్రతి సక్సెస్ స్టోరీ ఒకేలా ఉండదు. సమాజం చూసే హోదా, పరువు కంటే మనశ్శాంతిని ఎంచుకోవడమే లైఫ్‌లో అత్యంత ధైర్యమైన నిర్ణయం అంటూ క్యాప్షన్ పెట్టింది. హైక్స్ రాలేదనో ఉన్న జాబ్ పోయిందనో లేదా ఉద్యోగం రాలేదనో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో ఈ మహిళను చూసి జీవితంలో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలి సమాజం గురించి ఆలోచనలు పక్కన పెట్టి నచ్చినట్లు జీవించాలని నేర్పిస్తోంది. 

ALSO READ : నెలరోజులు AI వాడకానికి రూ.4వేల 750 కోట్లు బిల్లు పంపిన క్లాడ్.. కంపెనీకి దిమ్మతిరిగింది

ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెటిజన్లు ఆ మహిళా డ్రైవర్ ఆలోచనా విధానాన్ని, ధైర్యాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సమాజం ఏమనుకుంటుందో అనే అంచనాలను పక్కనపెట్టి, తనకు నచ్చినట్లు బతకడం అందరికీ సాధ్యం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలామంది ఐటీ ఉద్యోగులు కూడా ఈ వీడియో కింద స్పందిస్తూ.. కార్పొరేట్ లైఫ్‌లో తాము పడుతున్న మానసిక ఒత్తిడిని గుర్తుచేసుకుంటున్నారు. మొత్తానికి ఈ స్టోరీ డిజిటల్ దునియాలో ఒక హాట్ టాపిక్‌గా మారింది.