రాష్ట్రాన్ని స్కిల్ రాజధానిగా మారుస్తం.. యువతను ఏఐ ఎక్స్ పర్ట్స్ గా తీర్చిదిద్దుతం: శ్రీధర్ బాబు

రాష్ట్రాన్ని  స్కిల్ రాజధానిగా మారుస్తం.. యువతను ఏఐ ఎక్స్ పర్ట్స్ గా తీర్చిదిద్దుతం: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీల్లో యువతను అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ)లో నిర్వహించిన ‘స్కిల్ కాన్వకేషన్ ఇన్ ఐటీ/ఐటీఈఎస్ సెక్టార్ అండ్ ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్ హ్యాకాథాన్ 2025’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. గడిచిన రెండేండ్లలోనే 40 శాతానికిపైగా అంతర్జాతీయ కంపెనీలు జనరేటివ్ ఏఐను తమ కోర్ వర్క్‌‌‌‌లో భాగం చేసుకున్నాయని తెలిపారు. ఏఐ అనేది కేవలం ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తుందని స్పష్టం చేశారు. ఆటోమేషన్ వల్ల 8.5 కోట్ల ఉద్యోగాలు పోతే, కొత్తగా 9.7 కోట్ల స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తేల్చిందని గుర్తు చేశారు.

సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతోందని తెలిపారు.వాతావరణ మార్పుల వల్ల క్లీన్ టెక్, ఈవీలు, గ్రీన్ ఇన్నోవేషన్ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ డిజిటల్ యుగంలో కేవలం అకడమిక్ డిగ్రీలతో ఉద్యోగాలు రావని, ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే సక్సెస్ సాధ్యమని స్పష్టం చేశారు.తమ ప్రభుత్వం భవిష్యత్తుకు అవసరమైన స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌ను నిర్మిస్తోందని, మార్కెట్- అవసరాలకు తగ్గట్టు‘రెడీ టు వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బాధ్యతను భుజాన వేసుకుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఎస్‌సీఐ డైరెక్టర్ డా.రామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.