సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ సర్వే

సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ సర్వే

సినీ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ సర్వే నిర్వహించింది.  ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు సర్వే చేశారనే న్యూస్ సంచలనంగా మారింది.

కరోనా వైరస్ వ్యాప్తి  సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉండగా ఎందరో వలస కార్మికులను తమ తమ సొంత గ్రామాలకు చేర్చాడు సోనూ సూద్. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తమ రాష్ట్రాలకు తీస్కెళ్లడంలో పట్టించుకోని సమయంలో.. కొన్ని వందల బస్సులను ఏర్పాటు చేసి కూలీలను తమ ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం అతడి సేవలను ఎంతగానో కొనియాడారు.రియల్  హీరో అని అన్నారు.

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబై మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు.