ఫోన్​ ట్యాపింగ్​ వెనుక..బీఆర్ఎస్ ​సుప్రీం!

ఫోన్​ ట్యాపింగ్​ వెనుక..బీఆర్ఎస్ ​సుప్రీం!
  • రాధాకిషన్‌‌రావు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు
  • ఎన్నికల్లో టాస్క్‌‌ఫోర్స్‌‌ వెహికల్స్‌‌లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు
  • ఫోన్లు ట్యాప్​ చేసి ప్రతిపక్షాల మనీ సీజ్​.. హవాలా మనీగా ప్రచారం
  • దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్​ టైమ్​లో అపోజిషన్​ పార్టీలపై నిఘా
  • మూడోసారి బీఆర్ఎస్​ అధికారంలోకి తేవడమే ప్రభాకర్​రావు టీం టార్గెట్​
  • విచారణలో ఒప్పుకున్న టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు
  • ట్యాపింగ్​ కేసులో బీఆర్​ఎస్​ లీడర్లకు బిగిస్తున్న ఉచ్చు

హైదరాబాద్‌‌, వెలుగు : ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్​ఎస్​ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఎన్నికలొచ్చినా గులాబీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పనిచేసినట్టు తేటతెల్లమైంది. ఎలక్షన్​ టైంలో  ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం, దాన్ని హవాలా డబ్బుగా చూపెట్టడం.. బీఆర్‌‌‌‌ఎస్‌‌  పైసలైతే టాస్క్​ఫోర్స్​ వెహికల్స్​లో అభ్యర్థులకు చేరవేయడం వంటివి చేపట్టారని టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు రిమాండ్​ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

రిమాండ్​ రిపోర్టులో ‘బీఆర్​ఎస్​ సుప్రీం’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పొలిటికల్​ సర్కిల్స్​లో చర్చకు దారితీసింది. 2018 ఎలక్షన్స్‌‌తోపాటు దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్‌‌లో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌‌గా నాటి ఇంటెలిజెన్స్​ చీఫ్​ ప్రభాకర్‌‌‌‌రావు టీమ్‌‌ పనిచేసినట్టు విచారణలో రాధాకిషన్‌‌రావు అంగీకరించారు. మూడోసారి కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రభాకర్‌‌‌‌రావు ఆధ్వర్యంలో ప్రణీత్‌‌రావు, రాధాకిషన్ రావు టీమ్స్‌‌ ఫోన్​ ట్యాపింగ్​ను ఆయుధంగా వాడుకున్నట్లు తేలింది. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు, వారి అనుచరులు, సొంతపార్టీకి చెందిన ముఖ్యనేతలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్టు రిమాండ్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు. మునుగోడు బై ఎలక్షన్స్ సమయంలో  మాజీ ఎంపీ, కాంగ్రెస్​ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోన్​ను కూడా ట్యాప్​ చేసి, ఆయనకు చెందిన కంపెనీల డబ్బును అక్రమంగా సీజ్ చేశారు.

బేగంపేట్‌‌లోని విశాక ఆఫీస్‌‌ సహా కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం డిపాజిట్​ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బుగా ప్రచారం చేశారు. 2022 అక్టోబర్‌‌‌‌లో జరిగిన మునుగోడు బై ఎలక్షన్స్‌‌ సమయంలో బీజేపీ నాయకుల డబ్బును సీజ్ చేశారు. అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైన గుంట సాయికుమార్‌‌‌‌ రెడ్డి, కుండె మహేశ్, డీ సందీప్‌‌కుమార్‌‌‌‌, ఎం. మహేందర్‌‌‌‌, ఏ అనుశ్​రెడ్డి, వెన్నం భరత్‌‌ వద్ద రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు.

2023 అక్టోబర్‌‌‌‌లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో కూడా ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఫోన్‌‌ట్యాపింగ్ చేసింది.  ప్రణీత్‌‌రావు అందించిన సమాచారంతో రాధాకిషన్ రావు సెర్చ్‌‌ ఆపరేషన్స్ చేశారు. పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించడంలో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారు.దుబ్బాక ఎలక్షన్స్‌‌లో భారీగా డబ్బు స్వాధీనం 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో ఫోన్‌‌ట్యాపింగ్ ద్వారా శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి, భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్‌‌కు చెందిన రూ.70 లక్షలను సీజ్ చేసినట్టు రిమాండ్​ రిపోర్ట్​లో తెలిపారు.

2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల సిద్దిపేట చిట్‌‌ఫండ్‌‌ కంపెనీకి చెందిన రూ.కోటి సీజ్ చేశారు. ఇలా ప్రతి ఎన్నికల సమయంలో బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన అభ్యర్ధులే గెలిచే విధంగా ఇతర పార్టీలను కట్టడి చేశారు. ఇందుకోసం రాధాకిషన్‌‌రావును రిటైర్మెంట్​ తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగించారు. ఇందుకుగాను 2020 ఆగస్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్‌‌ డ్యూటీ (ఓఎస్‌‌డీ) పేరుతో రాధాకిషన్‌‌రావును మరో మూడేండ్లు (2023 ఆగస్టు)వరకు టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ గా కంటిన్యూ చేశారు. ప్రత్యేక జీవో విడుదల చేశారు. 

ప్రభాకర్‌‌‌‌ రావు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌‌ 

రాధాకిషన్‌‌ రావు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నత స్థానంలో నియమించింది. 2016లో టీ ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో డీఐజీగా పోస్టింగ్‌‌ ఇచ్చింది. ప్రభాకర్​రావు తన సామాజిక వర్గంలో నమ్మకమైన వారితో స్పెషల్‌‌ టీమ్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు. దుగ్యాల ప్రణీత్‌‌రావుతో పాటు  రాచకొండ కమిషనరేట్‌‌ పరిధిలో పనిచేస్తున్న భుజంగరావు, సైబరాబాద్‌‌ నుంచి వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌‌లో పనిచేస్తున్న తిరుపతన్నను నియమించుకున్నారు. ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్స్‌‌ టార్గెట్స్‌‌

సిటీపై పోలీస్‌‌ పట్టు సాధించేందుకు రాధాకిషన్‌‌ రావు తన టీమ్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ గట్టుమల్లు భూపతిని వెస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా నియమించుకున్నారు. గట్టుమల్లు 2021 వరకు రాధాకిషన్ రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. పొలిటికల్‌‌ లీడర్స్ టార్గెట్‌‌గా అప్పటికే ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్‌‌ టార్గెట్స్‌‌ (ఎస్‌‌ఓటీ)కు ప్రణీత్‌‌రావును చీఫ్‌‌గా నియమించారు.ఈ టీమ్‌‌లో గట్టుమల్లుకు పోస్టింగ్‌‌ ఇవ్వాలని చీఫ్ ప్రభాకర్‌‌రావుకు రాధాకిషన్ రావు రెకమండ్ చేశారు. దీంతో ప్రణీత్‌‌రావు టీమ్‌‌తో గట్టుమల్లు కలిసి అనేక ఆపరేషన్స్‌‌లో పాల్లొన్నారు.

ఎస్‌‌ఐబీ కేంద్రంగా ఆపరేషన్ ‘పొలిటికల్‌‌ లీడర్స్‌‌’‌‌

ప్రభాకర్ రావు సారథ్యంలో ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఆపరేషన్‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌ టార్గెట్స్ ప్రారంభించింది. బేగంపేటలోని ఎస్ఐబీ ఆఫీస్‌‌లో స్పెషల్‌‌ ఆపరేషన్స్ టార్గెట్స్‌‌ కోసం లాగర్‌‌‌‌ రూమ్‌‌లో ప్రణీత్‌‌రావుకు రెండు గదులను కేటాయించారు. ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌, ఎస్‌‌ఐ స్థాయి అధికారులను నియమించారు. పొలిటికల్ టార్గెట్స్‌‌ను ట్రాక్ చేసేందుకు వాట్సాప్‌‌, సిగ్నల్‌‌, స్నాప్‌‌చాట్‌‌ సహా పదుల సంఖ్యలో సోషల్‌‌మీడియా యాప్స్‌‌ను వినియోగించారు. వీటితో పాటు అత్యాధునిక టెక్నాలజీతో టూల్స్‌‌ ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరించిన ఫోన్ నంబర్స్‌‌ ఆధారంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత సూచించిన వారిని టార్గెట్ చేసేవారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలనకు తిరుగులేకుండా చేసేందుకే!

హైదరాబాద్‌‌ సిటీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ప్రభాకర్‌‌‌‌రావు సామాజిక సమీకరణాలు చేశారు. బీఆర్ఎస్​ అధినేత సూచనల మేరకు 2017లో రాధాకిషన్ రావును సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా నియమించారు. ప్రధానంగా ఇతర పొలిటికల్‌‌ పార్టీలను తమ ఆధీనంలోకి తీసుకురావడంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆర్థిక వనరులను కొల్లగొట్టే విధంగా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకోవాల్సిన ఆపరేషన్స్‌‌ను రూపొందించారు.ఇందుకోసం ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్ రావు సహా ప్రణీత్‌‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌‌ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న  ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. ఈ మీటింగ్స్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత ఆదేశాల అమలుపై చర్చించి, తదనుగుణంగా నడుచుకునేవారు.