
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి9 నుంచి నాల్గో టెస్టు జరగనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ ఈ టెస్టుకు వేదికకానుంది. ఇక ఈ సిరీస్లో భాగంగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాల్గో టెస్టుపై ఏది గెలుస్తుందో అని అభిమానుల్లో ఉత్కఠ నెలకొంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి ముందే పిచ్‌ల వ్యవహారం చర్చనీయాంశమైంది. టెస్టు సిరీస్ గెలిచేందుకు భారత్ తనకు అనుకూలమైన పిచ్లు తయారు చేసుకుంటుందని ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు తెగ విమర్శలు చేశారు. వీటిని పట్టించుకోని భారత్..మూడు టెస్టుల్లోనూ స్పిన్ వికెట్లను తయారు చేసింది. అయితే నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో భారత్ విజయం సాధించగా..ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్కు విలవిల్లాడి ఓడిపోయింది. స్పిన్కు విపరీతంగా సహకరించిన ఇండోర్ పిచ్పై టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ టెస్టుకు ఎలాంటి పిచ్‌ను తయారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి పిచ్...?
నాల్గో టెస్టుకు అహ్మదాబాద్ క్యురేటర్లు రెండు పిచ్‌లు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో ఒకటి, నల్లమట్టితో మరో పిచ్‌లను ఏర్పాటు చేశారు. నాలుగో టెస్టుకు తయారు చేసిన రెండు పిచ్‌లను కవర్లు కప్పి ఉంచారు. అయితే చివరి టెస్టు ఏ పిచ్పై ఆడాలన్న దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
బౌలింగ్ పిచా...? బ్యాటింగ్ పిచా..?
మరోవైపు పిచ్ ఎలా ఉండాలన్నదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి తమకు ఏ సూచనలు అందలేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారి తెలిపారు. అయితే మూడు టెస్టుల్లో పిచ్లు ఎలా ఉందో..నాల్గో టెస్టు పిచ్ కూడా అలాగే ఉంటుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో అతని మాటలను బట్టి.. స్పిన్ వికెట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే స్పిన్తో పాటు.. బ్యాటింగ్‌కు కూడా కాస్త ఉపయోగపడే అవకాశాలున్నాయి.