
పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్యేలు
నిర్మల్, వెలుగు : నిర్మల్, ముధోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నాయకులను, కార్యకర్తలను బుజ్జగించేందుకు పార్టీ హైకమాండ్ఆదేశాలతో మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ఆసంతృప్తి వాదులంతా ఇతర పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో బుజ్జగించేందుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆత్మీయ సమ్మేళనాలతో ముందుకు
కొంతకాలం నుంచి అంతర్గతంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న బీఆర్ఎస్ క్యాడరను చేరదీసి, వారి బుజ్జగించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. ఇయ్యల నిర్మల్ లోని నార్సాపూర్ (జి)లో మంత్రి ఐకే రెడ్డి, జిల్లా ఇన్చార్జి గంగాధర్ గౌడ్ మొదటి ఆత్మీయ సమావేశం జరుగుతుండగా.. దిలవార్పూర్, సోన్, లక్ష్మణచాంద, మామాడ లో ఆత్మీయ సమావేశాలు వరుసగా ఏప్రిల్ 12 వరకూ జరుగనున్నాయి.
కార్యకర్తలను ఒక్క దగ్గరికి పిలిచి , క్రియాశీలకంగా పని చేయించుకునేందుకు శ్రీకారం చుడుతున్నారు. నాలుగేండ్ల నుంచి కేవలం సీనియర్ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు మాత్రమే పార్టీలో ముందుంటూ సాధారణ కార్యకర్తలను, సభ్యులను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అలాగే కొంతమంది పూర్వ నేతలను సైతం ప్ర స్తుత ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు విస్మరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యమ కాలంతోపాటు ఆ తర్వాత కూడా పార్టీలో క్రియాశీలకంగా వవహరించినప్పటికీ కొద్ది రోజుల నుంచి వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అంటున్నారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుండడం, కొంతమంది సీనియర్ నాయకులకు ఆశించిన మేరకు గుర్తింపు రాకపోవడంతో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందంటున్నారు. అయితే బీఆర్ఎస్ అటు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరమైన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా నేతల మధ్య చిచ్చురేపుతున్నాయి.
గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ హైకమండ్ అప్రమత్తమై అటు నాయకులు ఇటు సాధారణ కార్యకర్తలు చేజారకుండా చూసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే కొంతమంది అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి వారిని సముదాయించే ప్రయత్నాలు చేసినా, పెద్దగా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశాలు, బుదరకింపులు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను సంతృప్తి పరుస్తాయో లేదో చూడాలి.