అలా నిర్వహిస్తే పాల్గొంటాం

అలా నిర్వహిస్తే పాల్గొంటాం

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఎంఐఎం చీఫ్‌‌, ఎంపీ అసదుద్దీన్‌‌ ఒవైసీ అన్నారు. తాను గానీ, తమ పార్టీ నేతలెవరైనా వ్యతిరేకించినట్టు ఒక్క ఆధారమున్నా చూపించాలని సవాల్‌‌ విసిరారు. తాను విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకించినట్టు చెప్తున్నోళ్లు.. ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. శనివారం హైదరాబాద్‌‌లో మీడియాతో అసదుద్దీన్ మాట్లాడారు. సెప్టెంబర్‌‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షాకు, సీఎం కేసీఆర్‌‌కు లేఖ రాశానని చెప్పారు.  

నిజాంపై అందరూ పోరాడారు... 

నిజాం ఫ్యూడల్‌‌ ప్రభుత్వం నుంచి విమోచనం కోసం అప్పటి హైదరాబాద్‌‌ స్టేట్‌‌లోని ప్రజలంతా ఉద్యమించారని అసదుద్దీన్ అన్నారు. ‘‘ఈ పోరాటంలో హిందువులు, ముస్లింలు కలిసే పోరాడారు. తుర్రేబాజ్‌‌ ఖాన్‌‌, షోయబుల్లాఖాన్‌‌, మగ్దూం మొహియుద్దీన్‌‌ ఈ గడ్డ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఈ సందర్భాన్ని ఒక ప్రాంతానికి విముక్తి దినంగా కాకుండా జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని కోరుతున్నాం” అని చెప్పారు. బీజేపీకి చెందిన గోషామహల్‌‌ ఎమ్మెల్యే హైదరాబాద్‌‌ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్నారు. సెప్టెంబర్‌‌ 17ను పురస్కరించుకొని ఎంఐఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో తిరంగ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తే.. ఆ కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని చెప్పారు. అలాగే మైనార్టీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు తొలగించడానికి కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ వేశారని.. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు మంచి లీగల్‌‌ టీంలు ఏర్పాటు చేసి, ఆ రిజర్వేషన్లు పరిరక్షించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.