ఆర్టీసీలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ఆర్టీసీలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
  • పీఆర్సీపై చర్చ, ఫిట్ మెంట్, నిధుల సర్దుబాటు ఎలా
  • ఆమోదానికి సర్కారుకు ప్రతిపాదనలు 
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో రానున్న రోజుల్లో భర్తీచేసే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు ఇవ్వాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉండగా ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో పీఆర్సీ, ఫిట్ మెంట్, నిధుల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించారు. ఆర్టీసీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇక ఈ నెల 6 తో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. పీఆర్సీకి అనుమతి ఇవ్వాలని ఈసీకి ప్రభుత్వం లేఖ రాయగా పర్మిషన్ ఇవ్వలేదు. ఎంత ఫిట్ మెంట్ ఇవ్వాలి, ఎంత భారం పడుతుంది, ఈ భారాన్ని భర్తీ చేసుకోవడం ఎలా అన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
 
ఇప్పుడిపుడే ఓఆర్ పెరుగుతుండడంతో పాటు రెగ్యులర్ గా రూ.15 కోట్ల రెవెన్యూ వస్తున్నది. పీఆర్సీ ఇస్తే నిధుల సర్దుబాటు ఎలా అన్న విషయంపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. 2 పీఆర్సీలు బకాయిలతో పాటు 2013 పీఆర్సీ బకాయిలు సైతం ఇవ్వాల్సి ఉంది. పీఆర్సీ, డీఏ, సీసీఎస్ తో ఇతర సమస్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం సైతం వారి  ఆగ్రహాన్ని గుర్తించి మునుగోడు ఎన్నిక నేపథ్యంలో డీఏలు, ఫెస్టివల్ అడ్వాన్స్ ప్రకటించింది. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు తో పాటు పలువురు అధికారులు బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్నారు.