తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కష్టం : ఈటల రాజేందర్​

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కష్టం : ఈటల రాజేందర్​
  • ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతున్నా

తూప్రాన్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ  హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం కష్టమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  అన్నారు. బుధవారం మెదక్  జిల్లా తూప్రాన్ లో  తూప్రాన్, మనోహరాబాద్​ మండల నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్  హయాంలోనే చాలినన్ని నిధులు లేక సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్  పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

గతంలో ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో తాను ఈ విషయం చెబుతున్నానని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమవుతుందని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్  నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు తక్కువ సమయంలో ఎక్కువ పని చేశారని, అందువల్లే బీజేపీకి భారీ మొత్తంలో ఓట్లు వచ్చాయని వెల్లడించారు.  రాష్ట్రంలోనూ చాలా చోట్ల బీజేపీ  ఓటింగ్  పర్సంటేజీ పెరిగిందని చెప్పారు. ఈ  కార్యక్రమంలో  నాయకులు మహేశ్ గౌడ్, నర్సోజి. మురళి, మల్లేశ్  ముదిరాజ్, శేఖర్  తదితరులు పాల్గొన్నారు.