గిరిజన ఇలవేల్పుల చరిత్రపై  ఐటీడీఏ నజర్..పుస్తక తయారీపై పీవో యాక్షన్ ప్లాన్ 

గిరిజన ఇలవేల్పుల చరిత్రపై  ఐటీడీఏ నజర్..పుస్తక తయారీపై పీవో యాక్షన్ ప్లాన్ 
  • ఇప్పటికే ట్రైబల్​ మ్యూజియం పర్యాటకులకు పరిచయం
  • మ్యూజియానికి విశేష ఆదరణ.. 
  • ఇప్పుడు ఆదివాసీ కోయల ఇలవేల్పుల చరిత్రనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం
  • రిటైర్డ్ హెడ్​మాస్టర్లు, గిరిజన పూజారులు, డోలీలతో స్పెషల్​టీమ్​ ఏర్పాటు
  • ఇప్పటి వరకు 120 వరకు ఇలవేల్పుల వివరాలను సేకరణ 
  • గోత్రాలు తెలిపే డాలుగుడ్డపై పరిశోధన

భద్రాచలం, వెలుగు :  గిరిజన ఇలవేల్పుల చరిత్రపై ఐటీడీఏ ప్రత్యేక ఫోకస్​పెట్టింది.​ ఆదివాసీలలో కోయతెగకు చెందిన వారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కులదైవాలైన ఇలవేల్పులను, జాతరలు పండుగల రూపంలో కొలుస్తారు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియదు. ఇలవేల్పుల చరిత్ర కనుమరుగు కాకుండా వాటి వివరాలు సేకరించి, పుస్తక రూపంలో పొందుపరిచి భావితరాలకు అందించేందుకు పీవో బి.రాహుల్ యాక్షన్​ ప్లాన్​ రూపొందించారు. ఈ పుస్తక తయారీపై నజర్​ పెట్టారు.

ఇప్పటికే ట్రైబల్​ మ్యూజియం ద్వారా వారు వినియోగించే వస్తువులు, ధరించే ఆభరణాలు, వారి సంప్రదాయ వంటకాలను టూరిస్టులకు ఐటీడీఏ పరిచయం చేసింది. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ కోయల ఇలవేల్పుల చరిత్రనూ వెలుగులోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభించారు. 

గద్దెల చెంతకు బృందాలు.. 

ఇలవేల్పుల చరిత్రలు తెలుసుకునేందుకు ఐటీడీఏ పీవో బి.రాహుల్​ కోయ ఇలవేల్పుల పరిశోధకులు, రిటైర్డ్ హెడ్​మాస్టర్లు, తలపతులు(గిరిజన పూజారులు), ఆర్తిబిడ్డ(డోలీ)లతో ఒక టీమ్​ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్​ జిల్లాలోని ప్రతీ ఆదివాసీ గ్రామంలో ఉండే గిరిజనుల ఇలవేల్పులు గద్దెల వద్దకు వెళ్తోంది. ఈ సర్వేలో సభ్యులు ఇలవేల్పు చరిత్ర, వంశావిర్భావం, జాతర నిర్వహించే తేదీలు, ముహూర్తాలు సేకరిస్తున్నారు. గోత్రానికో ఇలవేల్పు ఉంటుంది. ఇలా ఇప్పటివరకు120 వరకు ఇలవేల్పుల వివరాలను సేకరించారు.

వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, పినపాక, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, కామేపల్లి, పాకాలకొత్తగూడెం, కొత్తగూడ, ఎటపాక లాంటి మండలాల్లో 8 మంది సభ్యులతో కూడిన టీమ్​ పర్యటించింది. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబ్​బాద్, విలీన ఆంధ్రలోని ఒక మండలంలో ఇలవేల్పుల చరిత్రలతో కూడిన వివరాలను సేకరించారు.

గోత్రాలు తెలిపే డాలుగుడ్డ.. 

ఆదివాసీల్లో వారి గోత్రాలను తెలిపే డాలుగుడ్డ ఒకటి ఉంటుంది. ఇందులో ప్రధానంగా గట్టు ప్రకారం వీటిని నిర్ణయిస్తారు. 3,4,5,6,7 ఇలా ఐదు గట్టులు ఉంటాయి. ఈ గట్టుల ప్రకారమే గోత్రాలు.. ఆ గోత్రానికో ఒక ఇలవేల్పు ఉంటుంది. ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిని ఆరాధిస్తారు. డాలుగుడ్డపై ఆదివాసీల గోత్రాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. అందులో ఏనుగు, గుర్రం లాంటి జంతువులవే ఎక్కువగా ఉంటాయి.

ఐదు రకాల గట్లకు సంబంధించిన పూర్తి గోత్ర వివరాలు ఈ డాలుగుడ్డ తెలియజేస్తుంది. వీటి ప్రకారం మూడేళ్లకొకసారి గోత్రాలకు సంబంధించిన వారు జాతరలు నిర్వహించుకుంటారు. దేశంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ గోత్రాలకు సంబంధించిన వారు కచ్చితంగా వచ్చి ఈ జాతరలో పాల్గొని ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ డాలుగుడ్డపైనా పరిశోధనలు కొనసాగుతున్నాయి.