Rana-Dulquer: "సినిమా అంటే ఉద్యోగం కాదు, జీవనశైలి".. దీపికా వివాదంపై రానా, దుల్కర్ సంచలన వ్యాఖ్యలు!

Rana-Dulquer: "సినిమా అంటే ఉద్యోగం కాదు, జీవనశైలి".. దీపికా వివాదంపై రానా, దుల్కర్ సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తున్నప్పటకీ.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.  రోజుకు కేవలం 8 గంటలే పని చేయాలనే ఆమె డిమాండ్ తో ప్రభాస్ ' స్పిరిట్' ,  ' కల్కి 2898 AD పార్ట్ 2 '  వంటి భారీ చిత్రాలను నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  ఇది సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో చలన చిత్ర పరిశ్రమలో 8 గంటల పని విధానం ఆచరణ సాధ్యమేనా అనే దానిపై ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరో సారి చర్చకు దారితీశాయి.

 ఇది ఫ్యాక్టరీ కాదు.. 8 గంటల నిబంధన కరెక్ట్ కాదు..

ఇటీవల ఓ ఇంటర్యూలో రానా.. 8 గంటల పని విధానంపై  చాలా ఘాటుగా స్పందించారు. "ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక జీవనశైలి . మీరు ఇందులో ఉండాలనుకుంటున్నారా లేదా అనేది మీ నిర్ణయం. ప్రతి సినిమా దానికంటూ ఒక ప్రత్యేకతను, సమయాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది ఫ్యాక్టరీ కాదు. 8 గంటలు కూర్చుంటేనే బెస్ట్ సీన్ బయటకు వస్తుందనే రూల్ ఏమీ లేదు. ఒక గొప్ప కథను సృష్టిస్తున్నప్పుడు, దాని కోసం ఎంతైనా కష్టపడటానికి అంకితభావం చూపాలి. సినిమా మేకింగ్ అనేది టీమ్ వర్క్, ఇక్కడ క్రియేటివిటీ, టెక్నికల్ అంశాలు సజావుగా కుదరాలంటే 8 గంటల రూల్‌ను ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా పెట్టడం ఆచరణ సాధ్యం కాదు అని తేల్చిచెప్పారు. సినీ నిర్మాణం అనేది ముందుగా ఊహించలేని, నిరంతర కృషి అవసరమయ్యే కళాత్మక ప్రక్రియ అని రానా స్పష్టం చేశారు.

6 గంటలకే ప్యాకప్ చెప్పి ఇంటికి..

విభిన్న పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉన్న దుల్కర్ సల్మాన్ పని సంస్కృతిలో ఉన్న తేడాలను వివరించారు. మలయాళంలో పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా, తీవ్రమైన కృషి, నిరంతరాయమైన షూటింగ్‌లతో పనులు పూర్తి చేస్తారు. తక్కువ రోజుల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే వారి ప్రధాన లక్ష్యం. అయితే 2018లో తాను 'మహానటి' చేస్తున్నప్పుడు వర్క్ కల్చర్‌లో మార్పును చూసి ఆశ్చర్యపోయానని దుల్కర్ తెలిపారు. నా కెరీర్‌లో తొలిసారిగా సాయంత్రం ఆరు గంటలకే ప్యాకప్ చెప్పి ఇంటికి పంపేవారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది అని దుల్కర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో అయితే రెండు ఆదివారాలు సెలవు ఇవ్వడం వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.

అయితే, 8 గంటల పని విధానం అనేది ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న నిర్మాణ వ్యయం గురించి దుల్కర్ ఒక ముఖ్యమైన లాజిక్‌ను వివరించారు. నిర్మాతగా ఆలోచిస్తే... ఒక రోజు అదనంగా షూటింగ్ చేయడం కంటే, ఒకే రోజు కొంచెం అదనపు గంటలు పనిచేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని దుల్కర్ అన్నారు.  ఏది ఏమైనా ఈ8 గంటల  వర్కింగ్ అవర్స్ అంశం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు.. ముందు ముందు  దీనిపై ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి మరి..