
దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌లో దూకుడు లేకుండా ఆడటం కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఈ అంశం చాలా ముఖ్యమన్నాడు. ‘టెంపర్ ఉండాల్సిందే సర్. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పుడు కచ్చితంగా దూకుడు ఉంటుంది.
దూకుడు లేకుండా క్రికెట్ ఆడగలరని నేను అనుకోను. కాబట్టి దూకుడుతోనే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. మనం గెలవాలనుకుంటే దూకుడు ఉండాల్సిందే. లేదంటే కష్టం’ అని టోర్నీకి ముందు జరిగిన కెప్టెన్ల ప్రెస్ మీట్‌లో సూర్య వ్యాఖ్యానించాడు.
ఇదే ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా అదే రకంగా స్పందించాడు. కానీ తన ప్లేయర్లకు ఎటువంటి సూచనలు జారీ చేయనని తెలిపాడు ‘ఎవరైనా దూకుడుగా ఆడాలని కోరుకుంటే అది వాళ్ల ఇష్టం. నేను మాత్రం ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చాలా భిన్నంగా ఉంటారు.
పేసర్లు మాత్రం ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు’ అని సల్మాన్ పేర్కొన్నాడు. ప్రెస్ మీట్‌లో సూర్య, సల్మాన్ మధ్య అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ కూర్చున్నాడు. ఇక విస్రృతమైన ప్రాక్టీస్ సెషన్ల వల్ల టీమిండియా మెరుగైన స్థితిలో ఉందని సూర్య తెలిపాడు. ‘మాకు కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్లు జరిగాయి. ఆసియా కప్‌లో ఉత్తమ జట్లను ఎదుర్కోవడం మాకు కూడా సవాలే. యూఏఈని తక్కువగా అంచనా వేయడం లేదు. ఇటీవలి ట్రై సిరీస్‌లో వాళ్లు బాగా ఆడారు.
ఈ టోర్నీలోనూ మంచి పోటీ ఇస్తారని భావిస్తున్నాం. ఒక ఫార్మాట్‌లో బాగా ఆడుతున్నప్పుడు తుది జట్టులో మార్పులు చేయడం కరెక్ట్ కాదు. అనుకున్న ఫలితాలు వస్తున్నప్పుడు జట్టును మార్చడంలో ప్రయోజనం ఉండదు’ అని సూర్య వెల్లడించాడు. శాంసన్ విషయంలోనూ సూర్య భిన్నంగా స్పందించాడు. తాము కచ్చితంగా అతన్ని బాగా చూసుకుంటామని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు తాము సరైన నిర్ణయమే తీసుకుంటామని స్పష్టం చేశాడు.