
- ఆధిపత్య వర్గాలతో ఒరిగేదేం లేదు: ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
మహబూబ్ నగర్ అర్బన్/ ధన్వాడ, వెలుగు: సీఎం కేసీఆర్గద్దె దిగాల్సిన టైం వచ్చిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆధిపత్య వర్గాలు, పార్టీలతో సామాన్య ప్రజకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్‌లో ఆదివారం ఆయన పర్యటించి బీఎస్పీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటలతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పైసలతో ప్రాజెక్టులు కట్టి.. పంటలు వేయొద్దనే హక్కు సర్కారుకి లేదని చెప్పారు. ఫాంహౌస్‌లో కేసీఆర్ఏం పండిస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు.
పోలీసులు, అగ్రికల్చర్ఆఫీసర్లతో భయపెట్టి చెప్పిన పంటలే వేయాలని రైతులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేసీఆర్ మొన్నటి దాకా కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేసి, అడుగులకు మడుగులు ఒత్తి.. ఇప్పుడు దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన డ్రామాలను అర్థం చేసుకున్న హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. అనంతరం నారాయణపేట జిల్లా ధన్వాడలో జరిగిన రాజ్యాధికార సభలో ప్రవీణ్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు రాజకీయాలలోకి వచ్చి మెడికల్ కాలేజీలు, వందల ఎకరాల భూములు, వేల కోట్లు సంపాదించారని, కానీ పేద ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు తేలేకపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనకబడిపోవడానికి బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, కిషన్ రెడ్డిలు కారణం కాదని.. రాజకీయ కాంక్ష లేకపోవటమేనన్నారు.