‘సంక్రాంతి ఒక ఫిలిం ఫెస్టివల్‌లా మారింది. అందులో నేను కీలక పాత్ర పోషిస్తుండడం, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాన్ని అన్ని జనరేషన్‌ల ఆడియన్స్ ఆదరించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా తాను తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో రన్ అవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడి ఇలా ముచ్చటించారు.
‘‘చిరంజీవి గారిలో ఓ నేచురల్ టైమింగ్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ కాన్సెప్ట్ రెడీ చేశాం. నాకు నచ్చినట్టు ఆయన్ను చూపించాలనే తపన వల్ల రైటింగ్ వర్క్ చాలా స్మూత్‌గా జరిగింది. నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా రాసిన స్క్రిప్ట్ ఇది. సినిమా అంతా వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. శశిరేఖ లవ్ ట్రాక్ మాత్రం మధ్యలో వచ్చేలా రాసుకున్నాం. కానీ అది బిగినింగ్‌లో వస్తేనే బాగుంటుందని స్క్రీన్ ప్లేలో మార్పులు చేయడం ఇంకా బాగా వర్కవుట్ అయింది. అలాగే మందు సీన్ కూడా అద్భుతంగా పేలింది. అందరూ సరదాగా రీల్స్ చేస్తున్నారు.
ఇద్దరు స్టార్స్‌ను డైరెక్ట్ చేయడం నా డ్రీమ్. చిరంజీవి గారు, వెంకటేష్ గారి మధ్య ఉన్న స్నేహం వల్ల నా పని సులువైంది. వాళ్లను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. ఇక దర్శకుడిగా నాకిది క్లిష్టమైన సమయం. తర్వాతి సినిమా ఏది చేయాలనే విషయంపై ఆలోచనలు ఎక్కువైపోతాయి. సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పుతాం. ఇటీవల వైజాగ్ టూర్‌లో ఓ ఆలోచన తట్టింది. ఈసారి టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఓ విచిత్రమైన జర్నీ మొదలవబోతోంది. ‘వామ్మో ఇదేంట్రా బాబూ’ అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది.
టైటిలే చాలా విచిత్రంగా ఉంటుంది. కచ్చితంగా ఓ మేజిక్ అయితే జరగబోతోంది. స్టోరీ లైన్ ఒకే అయింది. ఎవరితో అనేది ఫిక్స్ అవలేదు. జూన్ లేదా జులై నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా మంచి ఎంటర్‌టైనర్. మళ్లీ సంక్రాంతికే అనడంలో సందేహం లేదు. ప్రేక్షకుల చిరునవ్వే నా విజయ రహస్యం. వరుస విజయాల కారణంగా కొందరు రాజమౌళి గారితో పోలుస్తున్నారు కానీ దర్శకుడిగా ఆయన చేసే సినిమాలు వేరు. నేను చేసే సినిమాలు వేరు. ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు. నేను ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టా. ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి” అని అనిల్ తెలిపారు.
