కాముడు కాలిండు.. తెలంగాణ పల్లెల్లో జాజిరి మోత

కాముడు కాలిండు.. తెలంగాణ పల్లెల్లో జాజిరి మోత

ఇవాళే కాముని పున్నం. కాముని పున్నానికి పదిరోజుల ముందు తెలంగాణ పల్లెలల్ల ఉండే సందడే వేరు. కాముని పున్నంనాడు చిన్న పోరగాండ్లు చేసే అల్లరి అంతా ఇంతాకాదు. ఇదంతా హోలీ పండుగ  టైమ్ లనే జరుగుతది. బడి ఈడు పోరగాండ్లు సాయంత్రమైతే ఒక్కటైతరు. నలుగురైదుగురు కలిసి ఓ బ్యాచ్ కడ్తరు. అందులో ఒకరిద్దరు జబ్బకు జోలెసంచి ఏసుకుంటరు. చెట్టు కొమ్మలు విరగ్గొట్టి కొందరు.. వడ్లోళ్ల దగ్గర బాడిష పట్టించి ఇంకొందరు.. మొత్తానికి మనిషికి రెండు జాజిరికోలలు దగ్గర పెట్టుకుంటరు. దోస్తుగాళ్లను ఏసుకుని.. ఇంటింటికి తిరుక్కుంట జాజిరాట ఆడ్తరు. పైసలో… వడ్లో, బియ్యమో, మక్కలో వెయ్యమని అడుగుతుంటరు. అప్పుడు పాడే పాటలు చానా హుషారుంటయ్.

“జాజిరి జాజిరి జాజ…  జాజిరాడపోతె ఏమేం దొరికే… జిల్లేడాకుల బెల్లం దొరికే….”

“రింగు రింగు బిల్లా… రూపాయి దండ… దండ కాదురా దామొర మొగ్గ.. మొగ్గ కాదురా మోతుకు నీడ.. నీడ కాదురా నిమ్మల బాయి.. బాయి కాదురా బచ్చలికూర.. కూర కాదురా కుమ్మరి మెట్టు.. “

“ఈరన్న బల్లి కోడె.. వీరగంధం పూసుకుని… ” ఇలా ఉంటయి పాటలు.

జాజిరాట అంటే మామూలుగుండదు. రాత్రి పూట కదా… ఈడ కోలలు కొట్టుకుంట పాడితే.. పక్క వాడల వినపడ్తది.  జాజిరాటకు పిల్లలు రోజూ వస్తే కొందరు ఏదో ఒకటి వేస్తరు. కొందరు ఏం ఇయ్యరు. కొందరు.. మొన్ననే కదా ఏసినం… కాముడు కాలినంక రాపోర్రి… అని మర్లకొడ్తరు. కసురుకుంటరు కొందరు తల్లులు. ఈ పోరగాండ్లు మాట వినరు అనుకుంట ఇంకొందరు తలుపులు పెట్టుకుంటరు. ఎవరు వేసినా ఎయ్యకపోయినా… ఆ బ్యాచ్ ల తిరిగేటోళ్ల ఇండ్లోళ్లు మాత్రం మంచిగ ఏదో ఒకటి ఇచ్చి పంపుతరు.

పున్నానికి ముందురోజు కాముడిని కాలుస్తరు. ఆ తెల్లారి హోలి ఆడి… ఊరంతా తిరుగుతరు పిల్లలు. దుకాన్లు, అరుగులు, రోడ్లు ఎక్కడ కనపడితే అక్కడ జాజిరి కోలలతో మోత మోగిస్తరు. ఆఖరునాడు కాబట్టి… జాజిరాటకు వచ్చినోళ్లకు కచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపుతరు పెద్దవాళ్లు.

హోలీనాడు.. పొద్దటినుంచి.. రాత్రి దాన్క ఇండ్లళ్లకు వస్తనే ఉంటరు. వచ్చినోళ్లకు వచ్చినట్టుగ.. ఏదోఒకటి ఇచ్చి పంపుతరు పల్లె జనం.

జాజిరాటల జోలెల పడ్డ పైసలు, గింజలను చివరిరోజు పంచుకుంటరు పిల్లలు. దావత్ చేసుకుంటరు. అందుకే.. ఒక్క రంగులు చల్లుకునుడే కాదు.. తెలంగాణల హోలీకున్న కతే వేరు.