
ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్. వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
టీజర్ ప్రారంభంలోనే “నమస్కారం.. ఈరోజు శుక్రవారం” అనే ఒక బేస్ వాయిస్‌తో మొదలవగానే, ఏదో భయంకరమైన కథను చూడబోతున్నామనే భావన కలుగుతుంది. టీజర్ మొత్తం ‘సువర్ణ మహల్’ అనే ఒక పాడుబడ్డ బంగ్లా చుట్టూ తిరుగుతుంది. ఈ బంగ్లాలోకి ప్రవేశించిన హీరో, హీరోయిన్‌లకు ఎదురయ్యే భయంకరమైన అనుభవాలను టీజర్ విజువల్స్ చూపించాయి. కథాంశాన్ని పూర్తిగా వెల్లడించకుండానే, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా టీజర్ లో చూపించారు. ఒక మిస్టరీని ఛేదించే పనిలో హీరో ఉన్నట్లుగా, అనుపమ భయంతో వణికిపోతున్నట్లుగా చూపించిన షాట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ టీజర్‌కు ప్రధాన హైలైట్ చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్‌తో కలిసి హారర్ ఎఫెక్ట్‌ను రెట్టింపు చేసింది. ప్రతి షాట్‌కు సరిపడా సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌లోని ఆ సౌండ్స్, విజువల్స్ చూస్తుంటే, థియేటర్లో ప్రేక్షకులు నిజంగానే భయంతో వణికిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయాన్ని అందుకుంటాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. మరి ఈ హారర్ థ్రిల్లర్ సినిమా బెల్లంకొండకు ఒక బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 12 వరకు వేచి చూడాల్సిందే.