క్రెడిట్ కార్డులు వాడుకుని రూ.28 లక్షలు ఎగ్గొట్టాడు...! నిందితుడిని అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు

క్రెడిట్ కార్డులు వాడుకుని రూ.28 లక్షలు ఎగ్గొట్టాడు...! నిందితుడిని అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు

హనుమకొండ, వెలుగు: క్రెడిట్ కార్డుల డబ్బులు వాడుకుని మోసగించిన వ్యక్తిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్, స్వైపింగ్ మెషీన్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  హనుమకొండ సీఐ శివ కుమార్ గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ రెండేండ్ల కింద హనుమకొండ రాయపురలో భద్రకాళి డిజిటల్ సేవ షాప్ ఏర్పాటుచేశాడు. 

ఆన్ లైన్ అప్లికేషన్స్ తో పాటు ఇన్ స్టా, ముద్ర, శాద్వాల్ పే యాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఐడీ తీసుకున్నాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు క్రెడిట్ కార్డు స్వైప్ చేసి డబ్బులు ఇచ్చేవాడు. అందుకు ఒక్కో కార్డుకు ఒక్కోలా కమీషన్  తీసుకునేవాడు. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ల కార్డులను తన వ్యాలెట్ లో యాడ్ చేసుకుని, వారి పర్మిషన్ తో తన అవసరాలకు డబ్బులను వినియోగించుకుని తిరిగి ఇన్ టైంలో బిల్ చెల్లించేవాడు. 

కొంతకాలంగా కస్టమర్ల కార్డుల నుంచి క్రాప్ లోన్,  అప్పులు కట్టడంతో పాటు ఇతర అవసరాల కోసమని దాదాపు రూ.28 లక్షలు వాడుకున్నాడు. ఇది తెలిసిన కస్టమర్లు  ఫోన్ చేస్తే రేపు మాపు అంటూ దాటవేస్తున్నాడు. అంత అప్పు కట్టడం తన వల్ల కాకపోవడంతో అరుణ్ విజయవాడకు మకాం మార్చాడు. దీంతో బాధితులు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాప్ ఖాళీ చేసేందుకు అరుణ్ హనుమకొండకు రాగా అరెస్ట్ చేశారు.