- సహజీవనం చేస్తే ఏటా రూ.6 వేలు జరిమానా
- కఠిన నిబంధనలు పెట్టుకున్న చైనాలోని ఓ గ్రామం
బీజింగ్: మామూలుగా అభివృద్ధి కోసం గ్రామాలు కొన్ని నియమాలు పెట్టుకుంటాయి. ఊరిని క్లీన్‌గా, ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు రూల్స్ అమలు చేస్తాయి. కానీ, చైనా యునాన్ ప్రావిన్స్‌లోని లిన్‌కాంగ్ జిల్లాలోని ఓ గ్రామం వింత, కఠినమైన రూల్స్ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. పెండ్లి, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనలపై భారీ ఫైన్ విధిస్తున్నట్లు ప్రకటించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆ రూల్స్ బోర్డును గ్రామ పంచాయతీలో పెట్టింది. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
రూల్స్ బోర్డులో ఫైన్స్ ఇవే..
“గ్రామ నియమాలు: అందరూ సమానమే” పేరిట వెలువడిన ఈ నిబంధనల లిస్ట్ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. లిస్ట్ ప్రకారం.. పెండ్లి కాకుండానే కలిసి జీవించే జంటలు(సహజీవనం) ఏటా 500 యువాన్లు (రూ.6,412) ఫైన్ కట్టాలి. పెండ్లికి ముందు యువతి ప్రెగ్నెంట్ అయితే 3,000 యువాన్లు (రూ. 38,472) చెల్లించాల్సి ఉంటుంది.
పెండ్లయిన 10 నెలల్లోపే బిడ్డ పుట్టితే ఆ తల్లిదండ్రులు 3,000 యువాన్లు (రూ. 38,472) జరిమానా కట్టాల్సిందే. వేరే రాష్ట్రంలోని వారిని పెండ్లి చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ. 19,236), దంపతులు కొట్లాడుకుని గ్రామ అధికారులను పంచాయితీకి పిలిస్తే ఆలుమగలు ఇద్దరూ విడివిడిగా 500 యువాన్లు (సుమారు రూ.6,412) చెల్లించాలి.
ఎవరైనా మద్యం మత్తులో గ్రామంలో హల్ చల్ చేస్తే 3,000 నుంచి 5,000 యువాన్లు (రూ.38,472 నుంచి రూ. 64,120), నిరాధార ఆరోపణలు, నిందలు వేస్తే 500 నుంచి 1,000 యువాన్ల (సుమారు రూ. 6,412 నుంచి రూ. 12,824) జరిమానా విధిస్తామని పేర్కొంది. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ అమలు చేస్తున్నట్లు తెలిపింది.
అయితే, ఈ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బోర్డును తొలగించింది.
