నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూశారు. శుక్రవారం (ఆగస్టు 15) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన 80వ ఏట మృతి చెందారు. ఇటీవలే ఆగస్టు 8న చెన్నైలోని తన ఇంట్లో కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

గణేశన్ ప్రస్థానం:

గణేషన్ తమిళనాడు బీజేపీకి చెందిన సీనియర్ నేత. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది ఆయనకు. 2023 ఫిబ్రవరి 19 నుంచి నాగాలాండ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. నాగాలాండ్ కు పనిచేసిన వారిలో ఆయన 19వ గవర్నర్.

అంతకు ముందు ఆయన మణిపూర్ కు 17వ గవర్నర్ గా కూడా పనిచేశారు. 2021 ఆగస్టు 27 నుంచి 2023 ఆగస్టు 19 మధ్య కాలంలో మణిపూర్ గవర్నర్ గా పనిచేశారు. అదే విధంగా 2022 జులై 18 నుంచి 2022 నంబర్ 17 మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. గవర్నర్ పదవులు చేపట్టక ముందు ఆయన రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 

గణేషన్ 1945 ఫిబ్రవరి 16న బ్రాహ్మణ కుటుంబంలో ఇలక్కుమిరకవన్, అలమేలు దంపతులకు జన్మించారు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో అతని అన్న దగ్గర ఉండి చదువుకున్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యి ప్రచారక్ గా పనిచేశారు.

 తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేసిన గణేషన్ మృతి తీరని లోటని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.