ఆకలి చావులతో చస్తున్నాం.. పర్మినెంట్ చేయండి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్

ఆకలి చావులతో చస్తున్నాం.. పర్మినెంట్ చేయండి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్

ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎల్బీనగర్ లోని శాతవాహన నగర్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. తమను పర్మినెంట్ చేయాలంటూ కోరారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తాము రాష్ట్రం కోసం ఉద్యమించామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తైందని, ఇప్పటికైనా తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్ల నుంచి పర్మినెంట్ ఉద్యోగుల తరహాలో విధులు నిర్వర్తించినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సరిగా అందక ఔట్ సోర్సింగ్ సంస్థలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కొంతమంది అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల తాము ఆకలిచావుల మధ్య ఆగమవుతున్నామని అన్నారు. 

డిమాండ్లు ఇవే.. 

* మూడేళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తు్న్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.

* సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జీవో16 ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా వేతనం చెల్లించాలి.

* మొదట మూడు సంవత్సరాల కాల పరిమితితో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.

* ఏజెంట్లను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి.

* ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి) రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

* ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్ మంజూరు చేయాలి.

* పీఆర్సీ బిశ్వాల్ కమిటీ సిఫారసు ప్రకారం ప్రతీ ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి.

* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ లేదా ఉద్యోగంలో నుంచి తీసివేయవద్దు

తమ ప్రధాన డిమాండ్లపై రానున్న రోజుల్లోనూ ఇతర శాఖల వారితోనూ చర్చిస్తామన్నారు. జులై 30వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న చర్చల్లో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు లక్ష్మయ్య, జనార్ధన్, ఎర్ర కిరణ్, జగన్, నవీన్, యాదయ్య, రాజు, వినోద్ తో పాటు పెద్ద సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.