కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది

కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది
  • కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది
  • ప్రభుత్వం గద్దె దిగే రోజులొచ్చాయ్: ప్రొ. కోదండరామ్
  • సీఎంకు విద్యారంగమంటే చులకన: ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్​ పాపిరెడ్డి
  • ప్రెస్​క్లబ్​లో కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ చర్చా వేదిక

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందని, బీఆర్ఎస్​ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ప్రొ. కోదండరామ్​ అన్నారు. అప్పట్లో చెప్పులు లేకుండా దొరల గడీలకు పోయినం.. కానీ ఇప్పుడు ప్రగతి భవన్ గేటు దాటలేకపోతున్నామని ఆయన విమర్శించారు. స్వరాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్మాణమా? విధ్వంసమా? అనే అంశంపై తెలంగాణ కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్​గౌరీ సతీశ్​అధ్యక్షతన గురువారం ప్రెస్ క్లబ్ లో చర్చా వేదిక జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రొ. కోదండరామ్ హాజరై మాట్లాడారు.

నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న కాలేజీలే టార్గెట్ గా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని, ఆ వేధింపులతో చాలా కాలేజీలు మూత పడ్డాయన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎలాంటి విజిలెన్స్ దాడులు లేవని, చిన్న కాలేజీల మీదనే దాడులు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్​సర్కార్ దిగితే తప్ప తెలంగాణలో విద్యా రంగం బాగుపడదన్నారు. పైసల ఆటలో ప్రజలు చిత్తు అవుతున్నారని, తాను ఎలక్షన్ లో పోటీ చేయడం లేదని, సమస్యలపై పోరాటం చేసేవారి వెంట ఉంటానని తెలిపారు. 

ఈ ప్రభుత్వమే ఉంటే 20% కాలేజీలూ ఉండవు

హయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. స్టేట్ కౌన్సిలింగ్ నిబంధనలకు సరిపోవడం లేదనే విజిలెన్స్ వేసి, రూల్స్​కు విరుద్ధంగా ఉన్న కాలేజీలను మూసేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థపై ఎన్నడూ పాజిటివ్ గా స్పందించలేదని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి విద్యారంగం పట్ల చులకన భావం ఉందన్నారు. విద్యారంగ సమస్యలను తన దృష్టికి తీసుకెళ్లినా, ఎడ్యుకేషన్, హెల్త్ తర్వాత చూద్దామనేవారని వెల్లడించారు.

ఇదే ప్రభుత్వం ఉంటే రానున్న రోజుల్లో 20 నుంచి 25 శాతం కాలేజీలు కూడా ఉండవన్నారు.సమస్యల పట్ల పోరాటం చేయాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ని ఇంటికి సాగనంపాలన్నారు. జూనియర్​ కాలేజీలను ఫైర్ సేఫ్టీ పేరుతో ఓ అధికారి ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అప్పట్లో డిగ్రీ కాలేజీల వైపు రాకుండా తాను కాపాడినట్లు చెప్పారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్(టీఎల్​ఎఫ్) గౌరవ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను, యూనివర్సిటీలులను సీఎం కేసీఆర్ సర్కార్ విధ్వంసం చేసిందన్నారు.

కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే 1000 జూనియర్ కాలేజీలు మూత పడేవి కాదని, రాష్టంలో 6,800 స్కూల్స్ మూతపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ , కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కో కన్వీనర్ నరేందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, కె. శ్రీనివాస్, పార్థసారథి, అక్రమ్, ఉస్మాన్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.