
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నేతలు కోరారు. శుక్రవారం వారు మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధి హామీ స్కీమ్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఉపాధి హామీలో నంబర్ వన్‌గా నిలవడానికి ఉద్యోగుల పనితనం, ప్రతిభే కారణమని మంత్రికి వివరించారు. పనికి తగిన విధంగా వేతనాలు అందాలంటే వారికి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు అంజిరెడ్డి, గురుపాదం, నాగభూషణం తదితరులు ఉన్నారు.