హిండెన్ బర్గ్ మరో రిపోర్టు.. ఈ సారి రూ.4వేల కోట్లకు పైగా సంపద ఆవిరి

హిండెన్ బర్గ్ మరో రిపోర్టు.. ఈ సారి రూ.4వేల కోట్లకు పైగా సంపద ఆవిరి

గత కొన్ని రోజుల క్రితం హిండెన్ బర్గ్ రిపోర్టుతో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ భారీ నష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘బ్లాక్‌’పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంపద అమాంతం ఆవిరైపోయింది. అతని సంపదలో దాదాపు మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4,327 కోట్లు) కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆయన సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌తోనూ అనుబంధం ఉన్న డోర్సే సంపద  ఎక్కువగా బ్లాక్‌(అంతకుముందు పేరు స్క్వేర్‌)తోనే ముడిపడి ఉంది. ఇందులోనే ఆయన సంపద సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ అంచనా వేస్తోంది. 

ఇక ట్విట్టర్‌లో డోర్సే పాత్రకు గానూ అక్కడ సంపద 388 మిలియన్ డాలర్ల వరకు ఉంది. బ్లాక్‌ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని.. సంస్థలోని ఖాతాల్లో 40 నుంచి 75 శాతం నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమకు వెల్లడించినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది.

అంతకు ముందు భారత్ కు చెందిన అదాన్ గ్రూప్ పైనా జనవరి 24న హిండెన్ బర్గ్ ఓ నివేదిక విడుదల చేసింది. దాని వల్ల ఆ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ140 బిలియన్‌ డాలర్లకు పైగా పడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. 2020లోనూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నికోలా పైనా హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పట్లో ఈ కంపెనీ సైతం భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.