ఫస్ట్‌‌ టెస్ట్‌‌కు జడేజా డౌటే!

ఫస్ట్‌‌ టెస్ట్‌‌కు జడేజా డౌటే!

న్యూఢిల్లీ: కంకషన్‌‌, హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీతో బాధపడుతున్న ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియాతో జరిగే ఫస్ట్‌‌ టెస్ట్‌‌లో ఆడే అవకాశాల్లేవు. ఈ రెండు గాయాల నుంచి కోలుకోవడానికి జడ్డూ కనీసం మూడు వారాలైన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈనెల 17న మొదలయ్యే డే నైట్‌‌ టెస్ట్‌‌లో ఆడటం కష్టంగా మారింది. ఇక హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీలో కండరం చిరిగినట్లు తేలితే.. 26 నుంచి మెల్‌‌బోర్న్‌‌లో జరిగే సెకండ్‌‌ టెస్ట్‌‌కు (బాక్సింగ్‌‌ డే) కూడా అతను అందుబాటులో ఉండడు. ‘ఐసీసీ కంకషన్‌‌ ప్రొటోకాల్స్‌‌ ప్రకారం హెడ్‌‌ ఇంజ్యూరీకి గురైన ప్లేయర్‌‌కు 7 నుంచి 10 రోజుల రెస్ట్‌‌ ఇవ్వాలి. అప్పుడే అతని పరిస్థితిపై  ఓ అంచనాకు రావొచ్చు.

దీనివల్ల 11 నుంచి జరిగే త్రీ డే వామప్‌‌ మ్యాచ్‌‌లోనూ జడేజా బరిలోకి దిగడు. వామప్‌‌ లేకుండా ఫస్ట్‌‌ టెస్ట్‌‌ ఆడే చాన్స్‌‌ లేదు కాబట్టి టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌ మరో ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టాల్సిందే’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాసేపు కంకషన్‌‌ను పక్కనబెడితే.. జడేజాకు అయిన హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీతోనే ప్రాబ్లమ్స్‌‌ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కనీసం ఒకటి లేదా రెండు టెస్ట్‌‌లకైనా ఈ స్పిన్నర్‌‌ అందుబాటులో ఉండే చాన్స్‌‌ లేదు. మూడు వారాలు ఆటకు దూరంగా ఉండి, ఆ తర్వాత ఫిట్‌‌నెస్‌‌ సాధించాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చు. విదేశాల్లో టెస్ట్‌‌లు ఆడే టీమిండియా జట్టులో జడేజా రెగ్యులర్‌‌ స్పిన్నర్‌‌గా ఉంటాడు. ఇప్పుడు తను ఆడే చాన్స్‌‌ లేదు కాబట్టి రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌కు లైన్‌‌ క్లియర్‌‌ అయినట్లే.