
జగద్గిరి గుట్ట పీఎస్ పరిధి కమల ప్రసన్న నగర్ లో వారం రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి చెందిన జిమ్ కోచ్ జయకృష్ణ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఆయన భార్య దుర్గ చిన్నా అనే వ్యక్తితో కలిసి సజీవ దహనం చేసినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే జయకృష్ణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అడ్డు తొలగించుకునేందుకు జయకృష్ణకు మద్యం తాగించి, పెట్రోల్ పోసి తగులబెట్టారని విచారణలో నిర్ధారించారు. భార్య ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మే 11న కమల ప్రసన్న నగర్ లో జయకృష్ణ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చే సరికే జయకృష్ణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా ? లేక అగ్నిప్రమాదమా? అనే కోణంలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన పోలీసులు జిమ్ ట్రైనర్ భార్య దుర్గ, ప్రియుడు చిన్నాను విచారించారు. వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించింది.