జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్​

జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్​

జీడిమెట్ల, వెలుగు :  ప్రభుత్వ భూములను కబ్జా చేసి పేదలకు విక్రయించి రూ.కోట్లు సంపాదించి తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ షేక్ ఆబీద్‌ను జగద్గిరిగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత కొన్నేండ్లుగా గాజులరామారంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటిని నిరుపేదలకు విక్రయించి రూ.కోట్లు దోచుకున్నాడు. భూములు ఇస్తానని చెప్పి మరికొందరి డబ్బులు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఇప్పటికే 16 కేసులు నమోదు కావడంతో పోలీసులు రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారు.

 బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను ఆక్రమించాడు. తాను తహసీల్దార్‌‌కు, ఇతర రెవెన్యూ అధికారులకు లక్షల రూపాయలు లంచం ఇచ్చానని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినా పోలీసులు ఆబీద్‌పై చర్యలు తీసుకోలేదు. రాజకీయ నాయకుల అండతో కొన్నేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆబీద్‌ను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. అలాగే, రూ.వందల కోట్ల విలువైన భూములు దోచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.