
జీడిమెట్ల, వెలుగు: బైక్ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.42 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ నరేశ్‌రెడ్డి, సీఐ నర్సింహ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. అడ్డగుట్టకు చెందిన గొల్లపల్లి శ్రీధర్ (26), కూకట్పల్లి, ఆల్విన్ కాలనీకి కౌశిక్ గౌడ్ (21), కట్టా మణికంఠ (20), శ్రీనివాస్ (28), గుంటూరుకు చెందిన షేక్ నగూర్ వలి (25) జల్సాలకు అలవాటుపడి గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వైన్ షాపులు, ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆగస్టు 24న తన బైక్ దొంగతనం జరిగిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహన తనిఖీల్లో శ్రీధర్‌ను నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో అతడితోపాటు ఉన్న మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు.