గుడి.. దర్గా.. చర్చ్.. : ఒకేరోజు జగన్ 3 వేరియేషన్లు (ఫొటోలు)

గుడి.. దర్గా.. చర్చ్.. : ఒకేరోజు జగన్ 3 వేరియేషన్లు (ఫొటోలు)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ ఉదయం నుంచి దైవదర్శనాల్లో బిజీగా గడిపారు. జగన్‌ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందించారు. ఆయన వెంట విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు.

శ్రీవారి దర్శనం చేసుకొని ఆయన నేరుగా కడపకు వెళ్లారు. ప్రఖ్యాతి గాంచిన అమీన్ పీర్ పెద్ద దర్గాలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  దర్గా లోని ప్రధాన మాజర్ల వద్ద పూల చాదర్లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రకు ముందు కూడా ఈ దర్గాలో ప్రార్థనలు చేశారు. పాదయాత్ర ముగింపు తర్వాత, ఎన్నికల కౌంటింగ్ వారం రోజుల ముందు కూడా జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆ తర్వాత పులివెందుల సి.ఎస్.ఐ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు వై.ఎస్ జగన్.