
పూరీ: ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత తెరిచిన రత్న భాండాగారం గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోసారి రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించినట్లు రత్న భాండాగార పర్యవేక్షక కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ వెల్లడించారు. జులై 18న గురువారం నాడు మరోసారి రత్న భాండాగారం తెరవనున్నట్లు తెలిపారు. వచ్చే గురువారం ఉదయం 9:51 నిమిషాల నుంచి 12:15 నిమిషాల వరకూ శుభ సమయం అని, ఆ సమయంలోనే రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించినట్లు వివరించారు. రత్న భాండాగారానికి సంబంధించి జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. రత్న భాండాగారం లోపల ఉన్న రహస్య గది తాళాలు ఆ రోజు తెరవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అసలు లోపల ఏమేం ఉన్నాయో ఆ రోజు తేలిపోనుందని, నిశితంగా పరిశీలించి అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తగా భాండాగారం లోపల ఉన్న ఆభరణాలను కొత్త అల్మారాల్లోకి, బాక్సుల్లోకి తరలించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నట్లు వివరించారు. రత్న భాండాగారంలోని సంపదను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రత్న భాండాగారంలోకి తరలించనున్నట్లు జగన్నాథ స్వామి ఆలయ అధికారి అర్వింద్ పాది తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక రత్న భాండాగారంలో సీసీటీవీ కెమెరాలను, లైట్స్ ను అమర్చినట్లు పేర్కొన్నారు. ఈ సంపదను అంతటినీ తరలించిన అనంతరం రత్న భాండాగారానికి సంబంధించిన మరమ్మతు పనులు మొదలుకానున్నాయి.
ALSO READ | రహస్యాల ఆలయం.. పూరీ జగన్నాథ స్వామి చరిత్ర ఇదే...
1978లో రత్న భాండాగారాన్ని తెరిచారు. 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెరిచారు. గత ఆదివారం,14వ తేదీ మధ్యాహ్నం 1:28కు లక్షల మంది భక్తుల ఆలయం వెలుపల ఉండగా రత్న భాండాగారాన్ని తెరిచారు. బంగారం, ముత్యాలు, వజ్రవైడూర్యాలతో కూడిన 180 ఆభరణాలను, 146 వెండి ఆభరణాలను రత్న భాండాగారం లోపల గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటు బంగారం ప్లేట్లు కూడా బయటపడ్డాయి. భాండాగారంలోని వెలుపల గదిని తెరిస్తే ఈ సంపద బయటపడింది. రత్న భాండాగారం లోపల గదికి మూడు తాళాలు వేసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మార్గదర్శకాల ప్రకారం.. మేజిస్ట్రేట్ సమక్షంలో మూడు తాళాలు ఓపెన్ చేసి లోపల గదిని తెరిచారు. అల్మారాల్లో సంపదను అధికారులు గుర్తించారు. అయితే.. ఆ సంపదను తరలించడానికి శుభ సమయం వరకూ వేచి ఉండాలని నిర్ణయించుకుని జులై 18వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆసక్తి రేపుతున్న మరో విషయం ఏంటంటే.. రత్న భాండాగారం లోపల గదిలో మరో రహస్య గది ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆ రహస్య గదిలో అంతులేని నిధి ఉందని, ఆ నిధికి కాపాడుతూ పాములు ఆ రహస్య గదిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రత్న భాండాగారం తెరిచే ముందు కూడా ఇదే తరహా ప్రచారం జరిగితే ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్ ఖండించారు. పాములున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు.
ALSO READ | పూరీ రత్న భాండాగారం ఓపెన్ ..నిధి తరలింపు కోసం 6 చెక్కపెట్టెలు
ఇదిలా ఉండగా.. రత్న భాండాగారం తెరవడంపై ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మీడియాకు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుందని తెలిపారు. అందులో భాగంగానే 'Bahar Ratna Bhandar' ముగిసిందని, ఆభరణాలను భద్రంగా తరలించామని వివరించారు. 'Bhitar Ratna Bhandar'ను త్వరలో తెరవబోతున్నామని చెప్పారు. రత్న భాండాగారం మరమ్మతు పనులను ఏఎస్ఐ (భారతీయ పురావస్తు శాఖ) చూసుకుంటుందని హరిచందన్ తెలిపారు. రత్న భాండాగార సంపద విలువను లెక్కగట్టే ప్రక్రియలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాను కూడా ఇన్వాల్వ్ చేయనున్నట్లు చెప్పారు. పారదర్శకత కోసమే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కౌంటింగ్ ప్రక్రియలో భాగం అవుతుందని తెలిపారు.
ALSO READ | పూరీ రత్నభాండాగారం ఓపెన్..పెట్టెల నిండా నగలు.!
2011లో కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో భారీగా సంపద బయటపడటంతో దేశం మొత్తం ఆ పరిణామాలను ఆసక్తిగా గమనించింది. 2011లో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేల మాళిగలను తెరిచారు. రూ.1.8 లక్షల కోట్ల సంపద ఆ నేలమాళిగల్లో ఉన్నట్లు తెలిసి దేశం మొత్తం అవాక్కయింది. తెరవకుండా ఉన్న ఆరో నేలమాళిగలో 83 లక్షల కోట్ల విలువ చేసే సంపద ఉంటుందని ఒక అంచనా. ఈ నేలమాళిగల్లో కళ్లు చెదిరే సంపద బయటపడిన తర్వాత ఈ కాన్సెప్ట్ తో సినిమాలు కూడా తెరకెక్కాయి. ఆ విలువైన సంపదకు పాములు రక్షణగా ఉంటాయని కొన్ని సినిమాల్లో చూపించారు. పూరీ ఆలయంలోని భాండాగారంలో కూడా పాములు ఉండి ఉండొచ్చనే ప్రచారం కూడా అందుకే జరిగింది. ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భాండాగారం చుట్టూ వస్తున్న వార్తలను కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తుండటం గమనార్హం.
ALSO READ | కేదార్‌నాథ్‌లో భారీ స్కాం.. 228 కేజీల గోల్డ్ మిస్సింగ్ : జ్యోతిర్‌మఠ శంకరాచార్య