V6 News

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ  స్వీకారం

ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ  స్వీకారం

భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు , విపక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై  విజయం సాధించారు.

1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.  జనతాదళ్‌ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది. 

జగదీప్ ధన్కర్ రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.