
- హరీశ్‌రావుపై జగ్గారెడ్డి మండిపాటు
హైదరాబాద్, వెలుగు: ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా తప్పుపట్టుడేందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో వచ్చే నీళ్లను వదిలేసి, కాళేశ్వరం పేరుతో లిఫ్ట్‌లు పెట్టారు. ఆ బ్యారేజీలు కుంగిపోతే మిమ్మల్ని తప్పు పడ్తూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దానని కూడా తప్పు పడ్తరా?’ అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హన్మంతరావు సూచనలు తుంగలో తొక్కింది మీరు కాదా.. నకిలీ ప్లానింగ్‌తో తెలంగాణ ప్రజల సొమ్మును నీళ్లపాలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.
మీరు చేసిన తప్పులను ఇదేమిటని ప్రశ్నిస్తే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ పైనే నిందలు వేసేలా విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా రేవంత్, ఉత్తమ్ మాట్లాడుతుంటే విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. కరెన్సీ మీద ఉన్న గాంధీ బొమ్మ ఎప్పుడు తీయాలా.. అని కుట్ర జరుగుతోందని బీజేపీపై ధ్వజమెత్తారు.