
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాటు కోడి అయితే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాయిలర్ కోడి అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్ అనవసరంగా సవాల్ చేస్తూ రేవంత్‌ను రెచ్చగొడ్తున్నాడని, ఒకవేళ సడెన్‌గా రేవంత్ వస్తే ఆయనను తట్టుకునే శక్తి కేటీఆర్‌కు లేదన్నారు. రేవంత్‌ను చూడగానే కేటీఆర్‌కు గుండెపోటు రావడం ఖాయమని సెటైర్ వేశారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేసిన కథలు ఇన్నీ అన్నీ కాదు. మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా తప్పేమీ లేదు. మల్లన్న సాగర్ రైతులను కేసీఆర్, ఆయన కుటుంబం పెట్టిన హింసకు వాళ్లను తిట్టడమే కాదు.. తల వరకు వారిని భూమిలో పాతిపెట్టి.. పైన పాములను వదిలేసి నరకం చూపించాలి’’అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ‘‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఎదుర్కొని నిలబడ్డాం.. అది మా ధైర్యం. కానీ కేటీఆర్ అధికారంలో ఉంటే వారిని వాడుకోవడం తప్ప.. కొట్లాడే సత్తా లేదు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అన్న మాటలు వింటే నెత్తురు మరుగుతోంది. కేటీఆర్‌కు చీము, నెత్తురు లేదా? ఇంత పద్ధతిలేని మనిషివి ఎలా అయ్యావు’’ అని పేర్కొన్నారు.